
కూసుమంచిలో విస్తృతంగా పర్యటించిన వీపీ గౌతమ్
పీహెచ్సీ, ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాల్లో తనిఖీలు
పాలేరులో టైర్ల షాపు పరిశీలన.. దుకాణం సీజ్‌కు ఆదేశం
కూసుమంచి పల్లె ప్రకృతి వనం గ్రేట్ అంటూ కితాబు
కూసుమంచి, సెప్టెంబర్ 29: ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యటన, ఆకస్మిక తనిఖీలతో కూసుమంచి మండల అధికారులు హైరానా పడ్డారు. బుధవారం కూసుమంచి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన.. వివిధ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పీహెచ్సీలో రోగులతోనూ, తహసీల్ కార్యాలయంలో రైతులు, వినియోగదారులతోనూ మాట్లాడారు. ఎదురవుతున్న సమస్యలు, అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బృహత్ పార్కును వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కూసుమంచి పల్లె ప్రకృతి వనం భేష్ అంటూ కితాబిచ్చారు. పాలేరు పర్యటనలో ఓ టైర్ల షాపును గమనించిన ఆయన.. అక్కడికి వెళ్లి పరిశీలించారు. టైర్లలో వర్షపు నీళ్లు నిల్వ ఉండడంతో ఆ షాపును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం కూసుమంచి వచ్చిన కలెక్టర్ వీపీ గౌతమ్.. ఏ కార్యాలయంలో తనిఖీకి వెళ్తున్నారో అర్థంగాక అధికారులు టెన్షన్ పడ్డారు. తొలుత ఎంఈవో కార్యాలయానికి వచ్చిన కలెక్టర్.. ఎంఈవో రామాచారితో మాట్లాడారు. విద్యార్థుల హాజరు గురించి అడిగారు. వికలాంగుల పాఠశాల మూతపడి ఉండడాన్ని గమనించారు. ఉన్న 12 మంది విద్యార్థులను రేపటి లోగా పాఠశాలకు రప్పించాలని ఆదేశించారు. తర్వాత ఎంపీడీవో కార్యాలయంలో ఈజీఎస్, హరితహారం, నర్సరీలు తదితర అంశాల గురించి ఎంపీడీవో కరుణాకర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా వివరాలను డీఆర్డీవో విద్యాచందన వివరించారు. హైవే భూసేకరణ తదితర అంశాలపై తహసీల్దార్‌తో మాట్లాడారు. పంచాయతీ రికార్డులను తెప్పించుకొని పరిశీలించారు. అనంతరం కూసుమంచి పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. చాలామంచిగా ఉందంటూ సర్పంచ్, కార్యదర్శిని అభినందించారు.
రోగులతో మాటామంతీ..
నాయకన్‌గూడెం వెళ్తూ పీహెచ్సీ వద్ద ఆగి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి అనారోగ్య సమస్యలను, అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్‌లో పరీక్షల తీరును పరిశీలించారు. బోర్డులో ఉన్న పరీక్షలు చేస్తున్నారా?లేదా? అంటూ వైద్యులను అడిగారు. ఐపీ రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం నాయకన్‌గూడెంలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తరువాత పాలేరు గ్రామంలో టైర్ల దుకాణదారులు టైర్లను నిర్లక్ష్యంగా రోడ్డుపై ఉంచడాన్ని కలెక్టర్ గమనించారు. టైర్లలో వర్షపు నీరు నిల్వ ఉండడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు.