
రెండు ఆర్థిక సంవత్సరాలకు లబ్ధిదారుల ఎంపిక
2,226 మందికి 17.97 కోట్ల రుణాలు
గ్రామ సభల ద్వారా అర్హుల గుర్తింపు
మామిళ్లగూడెం, సెప్టెంబర్ 29: తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల అభ్యన్నతికి తోడ్పాటునిస్తున్నది. దీనిలో భాగంగా గిరిజనుల అభివృద్ధికీ చేయూతనిస్తున్నది. భద్రాచలం ఐటీడీఏ ద్వారా యువత స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నది. గురుకులాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నది. తాజాగా ట్రైకార్ ద్వారా నిరుద్యోగ గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు గాను రుణాలు విడుదల చేయాలని నిర్ణయించింది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఖమ్మం జిల్లాలో 2,01,053 మంది గిరిజన జనాభా ఉన్నది. ఈ ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2,226 మంది నిరుద్యోగులకు రుణాలు అందించేందుకు యంత్రాంగం అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.
ట్రైకార్ రుణాల ఎంపికకు కసరత్తు..
జిల్లావ్యాప్తంగా 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ఆన్లైన్ ద్వారా ట్రైకార్ రుణాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను గుర్తించి రుణాలు అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మండలాల వారీగా గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం యూనిట్లను కేటాయించారు. లబ్ధిదారులను గ్రామసభల ద్వారా మండల స్థాయిలో ఎంపీడీవో ఆధ్వర్యంలో ఎంపిక చేసి జిల్లా స్థాయికి రుణాల మంజూరుకు పంపిస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 451 మంది లభ్ధిదారులకు రూ.3.76 కోట్ల రాయితీ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 2021-22 ఆర్థిక ప్రణాళికలో 1,775 మందికి రూ.14.97 కోట్ల రాయితీ నిధులను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రుణాల ఎంపిక చేసేందుకు మండలాల వారీగా కేటాయించిన యూనిట్లు, విడుదల చేసిన రాయితీ వివరాలను జిల్లా లీడ్ బ్యాంక్ అధికారులకు ఐటీడీఏ పీవో, కలెక్టర్ నుంచి ఉత్తర్వులు అందాయి. ఎంపికలో మండలంలో ఎంపీడీవో, మున్సిపాలిటీల్లో కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. సభ్యులుగా బ్యాంక్ అధికారులు, ట్రైకార్ నుంచి ప్రతినిధి, డీఆర్డీఏ, మహిళా సమాఖ్య ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో ఎంపికలు జరుగుతున్నాయి.