
నేడు కృష్ణాష్టమి పర్వం
ఆనందంలో ఆబాలగోపాలం..
సందడి చేయనున్న చిట్టి కన్నయ్యలు
ఉట్లు, కోలాటాలకు సన్నద్ధం
ఖమ్మం కల్చరల్/ కొత్తగూడెం కల్చరల్, ఆగస్టు 29 : గిరిధారి, గీతాచార్యుడు, నల్లన్నయ్య, వెన్నదొంగ, సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణపరమాత్ముని జన్మదినాన్ని సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించుకోనున్నారు. శ్రీమహా విష్ణువు అవతారంగా శ్రీకృష్ణ భగవానుడు శ్రావణ బహుళ రోహిణి నక్షత్రయుక్త అష్టమి తిథి నాడు జన్మించాడు. విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట గల పవిత్ర శ్రావణ మాసంలో శ్రీకృష్ణుడి జన్మదినం జన్మాష్టమిని జిల్లా అంతటా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. కృష్ణనామం, పూజలు, శ్రీకృష్ణ వేషధారణలు, ఉట్లు, కోలాటాల ఉత్సవాలతో జిల్లా అంతటా కృష్ణతత్వం ఉట్టిపడనుంది. ఈ మేరకు వైష్ణవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఇంటి వాకిళ్లల్లో అందమైన రంగవల్లులతోపాటు చిన్ని కృష్ణుడి పాద ముద్రలను వేసి కన్నయ్యను తమ ఇంటికి ఆహ్వానిస్తారు. ప్రత్యేక అలంకారంతో గల మండపాన్ని ఏర్పాటు చేసుకొని అందులో శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి విశేష పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా సకల శుభాలు తెచ్చిపెట్టే శ్రీకృష్ణ వ్రతాన్ని నిష్టతో ఆచరించనున్నారు. వెన్న దొంగకు ప్రీతిపాత్రమైన పలు రకాల పిండి వంటలు, స్వీట్లను నైవేద్యంగా సమర్పించి శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహానికి పాత్రులు కానున్నారు.
కృష్ణ మందిరాలు, వైష్ణవాలయాల్లో..
ఖమ్మం గుట్టలబజార్ శ్రీమురళీకృష్ణ మందిరంలో సుందర్ సత్సంగ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను రెండు రోజులపాటు నిర్వహించనున్నారు. ఆదివారం శ్రీవాసుదేవ ద్వాదశాక్షరి మహా మంత్ర హోమాన్ని భక్తుల సమక్షంలో శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మన గుడి’ కార్యక్రమంలో భాగంగా టేకులపల్లి శ్రీవేంకటేశ్వర గోశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించనున్నారు. గోపూజలు, ఉట్ల ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. చిన్నారులు శ్రీకృష్ణ వేషధారణలో కనుల విందు చేయనున్నారు.
ఉట్లు, కోలాటాలు, నృత్యాలతో హంగామా..
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినానికి ఉట్లు కొట్టడం ఒక ప్రత్యేకం. శ్రీకృష్ణ మురళీమందిరంతోపాటు టేకులపల్లి గోశాలలో ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. యశోదమ్మల సందడి కూడా వాడవాడల్లో మొదలైంది. తల్లిదండ్రులు తమ పిల్లలను కృష్ణుడి, యశోద, గోపికల వేషధారణల్లో ముస్తాబు చేయడంలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు కొందరు యశోదమ్మలు ఏమంటున్నారంటే.