ఖమ్మం, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీజన్ సగం దాటినా ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియలో పురోగతి కన్పించడం లేదు. చెరువులకు చేప పిల్లలు చేరే అంశంపై ఇప్పటికి సందేహాలే కన్పిస్తున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వంలో మత్స్యరంగానికి పెద్దపీట ఉండేది. చేప పిల్లల పంపిణీ మొదలుకొని మత్స్యకారులకు అందించే ఇతర అనుబంధ పరికరాల వంటివన్నీ వర్షపాతాన్ని బట్టి సీజన్‌కు అనుగుణంగానే, వీలైతే ముందుగానే అందేవి.
కానీ.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అవేవీ కన్పించడం లేదు. పైగా చేప పిల్లల పంపిణీపై ఇంకా ముందడుగు పడినట్లుగా కూడా కన్పించడం లేదు. దీంతో మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఆగస్టు గడిచిపోతున్నా చెరువుల్లో చేప పిల్లల విడుదల పనుల్లో మొదలుకాకపోవడం, టెండర్ల ప్రక్రియ కూడా నెలల తరబడి సాగుతుండడం వంటి అంశాలన్నీ వారి ఆందోళనకు అద్దం పడుతున్నాయి.
జిల్లాలో ఈ ఏడాది సీజన్ ఆరంభంలో కొంతమేరకు ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. అనంతరం భారీ వర్షాలు కురవడంతో జిల్లాలోని జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. సత్తుపల్లి, వైరా డివిజన్లలో వంద శాతం, మిగిలిన చోట్ల అరవై శాతం చెరువులు నిండిపోయాయి. అయితే ‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు’ అన్నట్లుగా ప్రకృతి సహకరించినా.. ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు.
దీంతో ఉచిత చేప పిల్లల పంపిణీ అంశం మరింత జాప్యమవుతోంది. సాధారణంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల శాఖలు సీజన్‌కు ముందుగానే వార్షిక ప్రణాళికలు సిద్ధం చేస్తాయి. ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉంటాయి. జూన్ నెలలోనే ఏర్పాట్లకు శ్రీకారం చుడతాయి. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది పరిస్థితి అంతా తారుమారైంది. జూన్ నెలలో మొదలుకావాల్సిన ప్రక్రియకు.. దాదాపు మూడు నెలలు దాటి ఆగస్టు ముగిసిపోతున్నా అతీగతీలేదు. జిల్లా మత్స్యశాఖలో ఉచిత చేప పిల్లల పంపిణీ అంశంలో కనీస పురోగతి లేదు.
మత్స్య కార్మికుల ఆర్థిక పరిపుష్టి కోసం గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో వ్యవహరించేది. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించడం, లక్షలాది చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడం, మత్స్య సాగు సహా మార్కెటింగ్ వంటి అవసరాల నిమిత్తం వాహనాలు, అవుట్ లెట్లు, వలలు, తెప్పలు వంటివి సమకూర్చేది. దీంతో జిల్లాలో మత్స్య ఉత్పత్తి గణనీయంగా పెరిగేది. జిల్లా ప్రజల అవసరాలు పోను ఇతర ప్రాంతాలకు ఎగుమతులూ ఉండేవి. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల్లో ప్రక్రియ పెద్దగా ముందుకు కదలలేదు.
వానకాలం సీజన్ ఆరంభానికి ముందే ఉచిత చేప పిల్లల పంపిణీకి టెండర్ల ప్రక్రియ ముగించాల్సి ఉంది. గత నెలలో 13నే టెండర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. అయితే ఒకటో రెండో టెండర్లు రావడంతో ప్రక్రియ 30కి వాయిదా పడింది. మరోసారి కూడా ఆశించిన స్థాయిలో టెండర్లు రాకపోవడంతో మళ్లీ వాయిదా పడింది. ఆ ప్రక్రియ ప్రస్తుతం ఇంకా కొనసాగుతోంది. అయితే, ఆంధ్రా కాంట్రాక్టర్లకు అవకాశం ఇవ్వకపోవడమే ఆశించిన మేర టెండర్లు రాకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సాధారణంగా చేప పిల్లల ఉత్పత్తి ఆంధ్రాలోనే ఎక్కువగా జరుగుతుంది. స్థానికులు టెండర్లు వేసినప్పటికీ ఎక్కువ శాతం చేప పిల్లలను ఆంధ్రా నుంచే తెప్పిస్తుంటారు. అయితే జిల్లాలో కాంట్రాక్టర్లు కుమ్మక్కుకావడం, ఇతర ప్రాంతాల నుంచి టెండర్లు రాకపోవడం వంటివి ఈ ఆలస్యానికి ప్రధాన కారణంగా కన్పిస్తోంది.
ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియ సెప్టెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో నిండిన చెరువులను గుర్తించాం. ప్రణాళికనూ సిద్ధం చేశాం. అయితే టెండర్లు ఆశించిన మేర రాకపోవడంతో కొంతమేర అలస్యమైంది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ టెక్నికల్ వర్క్ పూర్తి చేశాం. ఫీల్డ్ వెరిఫికేష్నూ పూర్తి చేశాం.
-రాజనర్సయ్య, జిల్లా మత్స్యశాఖ అధికారి, ఖమ్మం