
దేశవాళి వరి వంగడాలు సాగు చేస్తూ అద్భుత ఫలితాలు
ఎకరానికి రూ.30 వేల వరకు ఆదాయం
ఆదర్శంగా నిలుస్తున్న రైతు వెంకట్రామిరెడ్డి
మధిరరూరల్, అక్టోబర్ 28: ‘సాగులో కొత్త ఒరవడి ఎక్కడో ఒక చోట మొదలు కావాలి.. వచ్చిన దిగుబడులు రైతులకు లాభాలు తేవాలి.. ఇసుమంత కూడా రసాయనాలు లేని ఆహారం ప్రజలందరూ తినాలి.. ఊరికి పది మంది ప్రకృతి సేద్యం చేస్తే వచ్చే దిగుబడితో ఆ ఊరి ప్రజలంతా ఆరోగ్యవంతులు అవుతారు..’ అనేది ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామానికి చెందిన కుడుముల వెంకట్రామిరెడ్డి నినాదం. ఈ స్ఫూర్తితోనే ప్రకృతి సేద్యం గురించి తెలుసుకున్నాడు. సహజసిద్ధమైన ఎరువులతోనే పంటలు పండించడం ఎలాగో చూడాలనుకున్నాడు. ఇదే ఒరవడిలో నాలుగేళ్ల్లుగా దేశవాళి వరి వంగడాలు పండిస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నాడు. మంచి లాభాలు గడించి ఈ ఏడాది ఆరు వంగడాలు సాగు చేస్తున్నాడు. సాగులో ఆయన అవలంబిస్తున్న విధానాలపై ప్రత్యేక కథనం.
సాగు ఇలా..
రైతు వెంకట్రామిరెడ్డి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో తనకు ఉన్న నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. సాగులో రసాయనిక ఎరువులు బదులుగా గోవు నుంచి వచ్చిన పేడ, గోమూత్రాన్ని ఎరువులుగా వినియోగిస్తున్నాడు. బెల్లం, పప్పు పిండితో తయారు చేసిన జీవామృతంతో పిచికారీ చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నాడు. పంటకు 10 రోజులకోసారి నీటి తడులు పెడుతున్నాడు. ప్రస్తుతం నవారా, మైసూర్, మల్లిక, కాలబట్టి, కుంకుమపువ్వు, గౌస్ అనే దేశవాళి వరి రకాలను సాగు చేస్తున్నాడు. ఆయా విత్తనాలను ఓ ప్రైవేటు కంపెనీ నుంచి కిలో రూ.140 వెచ్చించి కొనుగోలు చేస్తున్నాడు. పంట పండిన తర్వాత విత్తనాల అవసరమైన వారికి తక్కువ ధరకే విత్తనాలు అందిస్తున్నాడు.
మార్కెటింగ్ ఇలా..
ఉరుకుల పరుగుల జీవితంలో తినీ తినక ఎక్కువ మంది చిన్న వయస్సులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. రసాయనాలు, ఎరువులు, పురుగుమందులు వాడిన ఆహారం తిని అనారోగ్యం పాలవుతున్నారు. వ్యాధుల నివారణకు ఒక్కటే మార్గం అనుకున్నాడు వెంకట్రామిరెడ్డి. సహజ సిద్ధమైన ఆహారంతో వ్యాధులను నివారించవచ్చని భావించాడు. పాడి చేస్తూ పశువుల పేడ, మూత్రంతో పంట పండిస్తున్నాడు. నవారా, మైసూర్, మల్లిక, కాలబట్టి, కుంకుమపువ్వు, గౌస్ రకాలు సాగు చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నాడు. గతేడాది 2.5 ఎకరాలు సాగుచేసిన వెంకట్రామిరెడ్డి ఈ సారి 3 ఎకరాలకు పైగా సాగు చేస్తున్నాడు. ఎకరానికి 20 బస్తాల దిగుబడి సాధిస్తున్నాడు. ఎకరానికి రూ.20 వేలు పెట్టుబడి పెట్టి రూ.30 వేల వరకు లాభాలు గడిస్తున్నాడు. ప్రకృతి సిద్ధంగా పండిన ఆహారం తినే వినియోగదారులకు నేరుగా ధాన్యం విక్రయిస్తున్నాడు. ప్రస్తుతం మార్కెట్లో కిలో బియ్యం ధర రూ.60కు పైగా పలుకుతున్నది. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకే ధాన్యం అందించడంతో వారికి తక్కువ ధరకు మంచి ఆహారం దొరుకుతుందనేది వెంకట్రామిరెడ్డి అభిప్రాయం. ఈ ఆహారం దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్ బారిన పడిన వారికి ఎంతో ఉపకరిస్తుందన్నారు. దేశవాళి వరి వంగడాల సాగుకు ప్రభుత్వం మరిన్ని ప్రోత్సహకాలు అందిస్తే మరింత మంది సాగుకు ముందుకు వస్తారని రైతు కోరుతున్నారు.
పోషక విలువలు కలిగిన ధాన్యం..
దేశావళి రకాల వరి వంగడాలు అత్యుత్తమైనవి. క్రిమి సంహారక మందులు వాడని పంట కావడంతో మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఇలా పండించిన ధాన్యంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గ్రామాల్లో ఒక్కో రైతు 10 రకాల వంగడాలను పండిస్తే భవిష్యత్తు తరాలకు వాటిని అందించవచ్చు. ఏటా విస్తీర్ణం పెరుగుతూ ఉంటే విత్తనాల కొరత ఉండదు. వీటి సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందివ్వడం రైతులకు కలిసి వచ్చే అంశం.