
పెట్రో, డీజిల్ ధరలతో అన్నింటిపైనా ప్రభావం
భారంగా నిత్యావసర, కూరగాయల ధరలు
గుదిబండగా మారిన గ్యాస్‌బండ
కేంద్రం తీరుపై ప్రజల ఆగ్రహం
కొత్తగూడెం, అక్టోబర్ 28 ;కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పెట్రోలియం ఉత్పత్తుల ధరలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు, ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ఉల్లి కోయక ముందే కన్నీరు తెప్పిస్తుండగా.. కొత్తిమీర వాసన చూసే పరిస్థితి లేదు. కూరగాయల ధరలు కూతకూత ఉడికిపోతున్నాయి. పప్పులు అసలే ఉడకడం లేదు. మాంసం రేట్లు మండిపడుతున్నాయి. కోడిగుడ్ల ధరలు కొండెక్కాయి. గ్యాస్‌బండ వంటింట మంట పుట్టిస్తున్నది. కన్నీళ్లొచ్చినా ఫర్వాలేదు.. ఇక నుంచి కట్టెల పొయ్యిపైనే వంట చేస్తామని మహిళలు శపథం చేస్తున్నారు. ఇలా ఒక్కటేమిటి అన్ని వస్తువులపై చమురు ధరల ప్రభావం కనిపిస్తున్నది. దీంతో ప్రజలు కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ సిలిండర్ ధరలు గుదిబండగా మారాయి.. పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి.. రోజు మార్చి రోజు ధరలు పెరుగుతూ సామాన్యుడి నడ్డి విరిస్తున్నాయి.. నూనెల ధరలు సెగ పుట్టిస్తున్నాయి.. ధరల వడ్డన నిరుపేద, మధ్యతరగతి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. కూలి చేసిన డబ్బులు మొత్తం కిరాణా కొట్టుకే వెళ్తున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ నిరుపేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని మరిచి ధరలు పెంచుతుందని ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలపై గణాంకాలతో ప్రత్యేక కథనం.
ట్రాన్స్పోర్ట్ రంగం అతలాకుతలం..
రవాణా రంగంలో కీలకమైన లారీ యాజమాన్యాలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. లారీలను రోడ్డుపై ‘తిప్పితే మూడు లాభం.. ఆపితే ఆరు లాభం..’ అన్నట్లుగా పరిస్థితి తయారైందని యజమానులు వాపోతున్నారు. ఆటో, ట్యాక్సీ, మినీ లారీ ట్రాన్స్పోర్ట్ రంగాలు సంక్షోభం అంచున ఉన్నాయి. వ్యవసాయరంగంలోనూ పెట్రో ధరల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. యాంత్రీకరణ పెరిగిన నేపథ్యంలో సాగు ఖర్చుల్లో పెట్రోల్ ధరలదే సింహభాగం కావడం గమనార్హం.
భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు..
డీజిల్ ధర పెరుగుదల అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్నది. కేవలం ఆరు నెలల్లోనే లీటర్ డీజిల్‌పై రూ.13.40 ధర పెరిగింది. ఈ ఏడాది మార్చిలో లీటర్ డీజిల్ రూ.87.47 కాగా, ప్రస్తుతం రూ.105 దాటింది. గతేడాది మార్చిలో డీజిల్ ధర రూ.67.71, ఏడాదిన్నరలోనే రూ.33.16 పెరిగింది. ఈ నెలలో తొమ్మిది రోజుల్లోనే ఆరు సార్లు డీజిల్ ధర పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. పెట్రోల్ ధర గతేడాది లీటరుకు రూ.63 కాగా, ప్రస్తుతం రూ.111 దాటింది. 16 నెలల్లోనే రూ.46 పెరుగుదల కనిపిస్తున్నది. పౌర సరఫరాల విభాగం లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో రోజూ నెలకు 7.87 లక్షల లీటర్ల పెట్రోల్, 12.05 లక్షల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతున్నది. గతేడాది ధరలతో పోలిస్తే వినియోగదారులపై ప్రస్తుతం ఒక్కో నెలకు డీజిల్‌పై రూ.119.70 కోట్లు, పెట్రోల్‌పై రూ.108 కోట్ల ఆదనపు భారం పడుతున్నది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం నిత్యావసరాలపై పడుతున్నది. నిత్యావసరాల వస్తువుల ధరల్లో ఒక కిలోకు రూ.20 నుంచి రూ.80 వరకు పెరుగుదల కనిపిస్తున్నది.
గ్యాస్ బండ.. మోయలేని భారం
గ్యాస్ సిలిండర్ ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. త్వరలోనే కేంద్రం ‘వెయ్యి’ మార్కు దాటిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.930 నుంచి రూ.940 వరకు చేరింది. సిలిండర్‌పై ఇస్తున్న సబ్సిడీ రూ.20 దాటడం లేదు. గతేడాది ధర రూ.663.50 మాత్రమే. ప్రస్తుత ధరతో పోలిస్తే రూ.306 పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెలలో పెరిగిన రూ.15 లెక్కిస్తే జిల్లావ్యాప్తంగా నెలకు రూ.45 లక్షల వరకు అదనపు భారం పడుతున్నది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కేంద్రం సబ్సిడీని పెంచడం లేదు. సాధారణంగా పెరిగిన ధరలో 75 శాతం సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా కేంద్రం ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు.
బతుకు బండికి బ్రేక్ పడింది..
కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చిన విధంగా ధరలు పెంచడంతో మాలాంటి నిరుపేదలకు ఇబ్బందిగా మారింది. రోజువారీ పనులు చేసుకొని జీవించే మాకు ధరల పెంపు భారంగా మారింది. ఏం కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు.. ధరలు అమాంతం పెరిగిపోయాయి. టూవీలర్ తీయాలంటే పెట్రోల్ ధరల గురించి ఆలోచించాల్సి ఉన్నది. నడుచుకుంటూ బయటకు రావాల్సి వస్తుంది. ఇంత దారుణంగా రేట్లు పెరిగితే మేం ఎలా బతకాలి ?