
ఏన్కూరు, జూన్ 28: పల్లెప్రగతిలో నూకాలంపాడు పంచాయతీ రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా ఉందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. మండలంలోని నూకాలంపాడు పంచాయతీలోని వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, కంపోస్టు షెడ్లను సోమవారం ఆయన సందర్శించారు. పరిసరాలను పరిశీలించి ప్రకృతివనంలో మొక్కలు నాటారు. సర్పంచ్ ఇంజం శేషగిరిరావు అహర్నిశలూ శ్రమించడం వల్లనే ఈ పల్లె ప్రకృతి వనానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించిందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ప్రత్యేకంగా అభినందించారు. నూకాలంపాడు పంచాయతీకి రాష్ట్రస్థాయిలో అవార్డు కచ్చితంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. నూకాలంపాడు ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు బుట్టలను పంపిణీ చేశారు. ఏన్కూరు రైతువేదికలో 75 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. ట్రైకార్ కింద మంజూరైన నాలుగు మినీ వ్యాన్లను ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ముందుగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఆయన సేవలను గుర్తుచేశారు.