
దుమ్ముగూడెం, అక్టోబర్ 27: ఏజెన్సీ యువత క్రీడల్లో రాణించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్ ఆకాంక్షించారు. మండలంలోని ములకపాడు పీహెచ్సీ వెనుక దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు కృషితో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇక్కడి యువతకు క్రీడల్లో ఆసక్తి పెంపొందించేందుకు క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గిరిజన క్రీడాకారులు అన్ని క్రీడల్లో రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. గిరిజనులకు ఎక్కువగా క్రీడలపై ఆసక్తి ఉంటుందన్నారు. వారు ఎంచుకున్న క్రీడలో విజయం సాధించేలా ఈ క్రీడా మైదానం ఒక వేదిక కావాలని ఆకాంక్షించారు. అనంతరం భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో క్రీడాకారులకు ఇప్పటికే వాలీబాల్, క్రికెట్ కిట్లు అందిస్తున్నామని అన్నారు. గిరిజనులకు సోలార్ లైట్లు పంపిణీ చేస్తున్నామని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తొలుత క్రీడా మైదానం ప్రారంభించిన తర్వాత పీవో కొద్దిసేపు క్రికెట్ ఆడారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రవికుమార్, స్పోర్ట్స్ అధికారి వీరూనాయక్, పీహెచ్సీ వైద్యులు బాలాజీనాయక్, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.