
ఇల్లెందు, అక్టోబర్ 27: వచ్చే నెల 15న వరంగల్‌లో జరిగే విజయగర్జన సభను జయప్రదం చేయాలని, కనీవినీ ఎరుగని విధంగా ఇల్లెందు నియోజకవర్గం నుంచి తరలివెళ్లాలని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య పిలుపునిచ్చారు. ఇల్లెందు మార్కెట్ యార్డులో బుధవారం నిర్వహించిన టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. మరో ఇరవై ఏళ్ల వరకూ కేసీఆరే ముఖ్యమంత్రి అని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ ఆవిర్భవించిందని స్పష్టం చేశారు. కేవలం ఉనికి కోసమే బీజేపీ, కాంగ్రెస్ ఆరాటపడుతున్నాయని ఎద్దేవా చేశారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ రాష్ర్టానికి మరే రాష్ట్రమూ సరితూగదని అన్నారు. తెలంగాణలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని, మన రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సీఎం కేసీఆర్‌ను కూడా దేశం రోల్‌మోడల్‌గా చూస్తోందని కొనియాడారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి రాష్ట్ర ప్రభుత్వ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాలని సూచించారు. వరంగల్ సభకు ఇల్లెందు నియోజకవర్గం నుంచి 20 వేలమంది వరకు కార్యకర్తలు తరలివెళ్లే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం మహబూబాబాద్ జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, ఇల్లెందు ఏఎంసీ చైర్మన్ బానోత్ హరిసింగ్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, రైతుబంధు సమితి సభ్యుడు పులిగళ్ల మాధవరావు మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకులు శీలం రమేశ్, కొక్కు నాగేశ్వరరావు, సిలివేరి సత్యనారాయ ణతోపాటు నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.