
ప్రజల ఆత్మ గౌరవానికి భంగం కలిగించొద్దు
జిల్లా పోలీసులకు డీజీపీ మహేందర్‌రెడ్డి సూచన
మరియమ్మ కుటుంబ సభ్యులకు పరామర్శ
జిల్లాలో పలు పోలీసు స్టేషన్లలో ఆకస్మిక తనిఖీ
ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై ఇన్స్పెక్టర్లకు దిశానిర్దేశం
ఖమ్మం, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):ప్రజలందరికీ పోలీసులు ఏకీకృత సేవలందించాలని, వారి ఆత్మ గౌరవానికి భంగం కలిగించొద్దని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీసుల అదుపులో మరణించిన చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన అంబటి మరియమ్మ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం ఉదయం ఆయన ఖమ్మం వచ్చారు. తొలుత చికిత్స పొందుతున్న బాధితురాలి కుమారుణ్ని పరామర్శించారు. ఘటన గురించి తీశారు. డీజీపీ స్పందిస్తూ.. మరియమ్మ మృతిపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిందని, కుటుంబ సభ్యులు ఆందోళన చెందొద్దని, విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఖమ్మం త్రీటౌన్, కొణిజర్ల, ఖమ్మం రూరల్ పీఎస్‌లను సందర్శించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై ఇన్స్పెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కేసుల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.
ఖమ్మం, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ పోలీసులు ఏకీకృత సేవలందించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. ప్రజల ఆత్మ గౌరవానికి భంగం కలిగించవద్దని నిర్దేశించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదివారం ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసుల అదుపులో మరణించిన చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన అంబటి మరియమ్మ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఖమ్మానికి చేరుకున్నారు. పలు పోలీసు స్టేషన్లను తనిఖీ చేసి జిల్లాలో శాంతి భద్రతల అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు నిర్వహించాల్సిన విధులపై ఆయన దిశానిర్దేశం చేశారు. పటేల్ స్టేడియం నుంచి నేరుగా మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్ చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి అతణ్ని పరామర్శించారు. జరిగిన సంఘటన గురించి ఉదయ్‌కిరణ్‌తో మాట్లాడి ఆరా తీశారు. పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరు, కొట్టిన దెబ్బలను ఉదయ్‌కిరణ్ వివరించాడు. తల్లి మరియమ్మ తన చేతిలోనే ప్రాణాలు వదిలిందని, ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేకపోతున్నానని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ సందర్భంగా డీజీపీ స్పందిస్తూ.. మరియమ్మ మృతిపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిందని, కుటుంబ సభ్యులు ఆందోళన చెందొద్దని, విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది..
మరియమ్మ కుమార్తెలు, అల్లుళ్లను డీజీపీ పరామర్శించారు. మరియమ్మ మృతి దురదృష్టకర సంఘటన అని అన్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. కలెక్టర్ కర్ణన్ కూడా ఉదయ్‌కిరణ్‌ను పరామర్శించారు. ప్రభుత్వం మరియమ్మ కుటుంబానికి రూ.35 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని, ప్రభుత్వ ఉద్యోగం సైతం ఇవ్వాలని నిర్ణయించిందని, త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని వివరించారు. ఉదయ్‌కిరణ్ ఆరోగ్య పరిస్థితి గురించి డీజీపీ మహేందర్‌రెడ్డి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఆందోళన చెందవద్దంటూ ఉదయ్‌కిరణ్‌ను ఓదార్చారు. అనంతరం డీజీపీ ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌కు చేరుకొని విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో గల ఎంటీ సెక్షన్‌ను తనిఖీ చేశారు. ఖమ్మం త్రీటౌన్, ఖమ్మం రూరల్, కొణిజర్ల పోలీస్ స్టేషన్లనూ సందర్శించారు. ప్రజల ఆత్మ గౌరవానికి భంగం కలుగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజామోదం లభించడం ద్వారానే విధి నిర్వహణ సామర్థ్యం ఆధార పడి ఉంటుందని అన్నారు. వివిధ కారణాల వల్ల పోలీసులు అదుపులోకి తీసుకున్న వాహనాలను సత్వరం వాహన దారులకు అందేలా చట్ట ప్రకారం వ్యవహరించాలని, ఒకవేళ ఆ వెహికిల్స్ వాహనదారులకు చేరే పరిస్థితి లేకపోతే మూడు నెలలకు ఒకసారి ఉన్నతాధికారుల అనుమతితో వేలం వేయాలని సీపీ విష్ణుకు సూచించారు. అనంతరం ఖమ్మంలోని పటేల్ స్టేడియానికి చేరుకుని హెలికాప్టర్ ద్వారా నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డితో కలిసి హెదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు. డీజీపీకి సీపీ విష్ణు ఎస్ వారియర్, ట్రైనీ ఎస్పీ స్నేహమెహ్రా, డీసీపీ ఇంజారపు పూజ, అడిషనల్ డీసీపీ సుభాశ్ చంద్రబోస్ తదితరులు వీడ్కోలు పలికారు.
ప్రజల నమ్మకమే ఆధునిక పోలీసు వ్యవస్థకు పునాది: డీజీపీ
మామిళ్లగూడెం, జూన్ 27 : ప్రజల నమ్మకమే ఆధునిక పోలీసు వ్యవస్థకు పునాది అని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం పలు పోలీసు ఠాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ పోలీస్ ఠాణాకు వెళ్లిన ఒకే విధమైన స్పందన ఉండాలన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా వారి ఆత్మగౌరవానికి భంగం కలుగకుండా నిష్పక్షపాతంగా సేవలందించాలని సూచించారు. రక్షణ కోసం వచ్చిన బాధితుల పట్ల మానవీయ కోణంలో వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. 14 ఫంక్షనల్ వర్టికల్స్, 5ఎస్ విధానం, లీడర్షిప్ క్వాలిటీ అమలు తీరు వంటి వాటిని అడిగి తెలుసుకున్నారు.
మరియమ్మ కుమారుడికి పరామర్శ..
ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్‌ను డీజీపీ పరామర్శించారు. ఆసుపత్రికి వచ్చిన డీజీపీ నేరుగా చికిత్స పొందుతున్న ఉదయ్‌కిరణ్ దగ్గరకు వెళ్లారు. సంఘటన వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మరియమ్మ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసులు తమ పట్ల వ్యవహరించిన తీరును వారు డీజీపీకి వివరించారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక తన తల్లి తన చేతిలో పడిపోయి మూత్ర విసర్జన చేసుకుని ప్రాణాలు విడిచిందని భోరున విలపిస్తూ ఉదయ్‌కిరణ్ డీజీపీకి తెలిపాడు. తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వివరించాడు. తన ఒంటిపై అయిన గాయాలను డీజీపీకి చూపించాడు.
కొణిజర్ల, ఖమ్మం రూరల్ పీఎస్‌ల తనిఖీ
కొణిజర్ల/ ఖమ్మం రూరల్, జూన్ 27 : కొణిజర్ల, ఖమ్మం రూరల్ పోలీసు స్టేషన్లను కూడా డీజీపీ మహేందర్‌రెడ్డి తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులకు ఎలాంటి సేవలు అందుతున్నాయనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటిని మరింత బలోపేతం చేయాలని సూచించారు. వైరా ఏసీపీ సత్యనారాయణ, సీఐ వసంతకుమార్, ఎస్సై ఎం.రవి, ఖమ్మం రూరల్ ఎస్సై శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.