
ఆదేశాలు జారీ చేసిన డీఈవో
శానిటైజేషన్ పనులు షురూ
స్కూల్స్‌ను తనిఖీ చేస్తున్న డీఈవో, కలెక్టర్
ప్రైవేట్ జూనియర్ కళాశాలల నిర్వాహకులతో డీఐఈవో సమావేశం
ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 26: విద్యాసంస్థల పునఃప్రారంభానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పాఠశాలలు ప్రారంభమయ్యే వరకు టీచర్లు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలకు సెలవుల్లేవని డీఈవో యాదయ్య గురువారం ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని ఉపాధ్యాయులకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు.
శానిటైజేషన్ స్టార్ట్..
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో శానిటైజేషన్ పనులు ముమ్మరమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మున్సిపల్, పంచాయతీ సిబ్బందితో పాఠశాల ఆవరణ, తరగతి గదులను శుభ్రం చేస్తున్నారు. పాఠశాలల్లో పెరిగిన పిచ్చి చెట్లను తొలగించడం, నీరు నిలిచే చోట మట్టి తొలగిస్తున్నారు. మరుగుదొడ్లు, వాటర్ ట్యాంక్‌లను శుభ్రం చేయడంతోపాటు శానిటేజేషన్ను వేగవంతం చేశారు. విద్యాసంస్థల్లో తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలిస్తున్నారు. గురువారం కల్లూరు మండలంలో పర్యటించి పాఠశాలలను తనిఖీ చేశారు. డీఈవో యాదయ్య కూసుమంచి మండలంలోని పలు పాఠశాలలను తనిఖీ చేశారు.
వ్యాక్సినేషన్ సైతం..
జిల్లాలో ఎంతమంది ఉపాధ్యాయులు వ్యాక్సిన్ వేసుకున్నారో వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్స్టాప్-10,318 మంది, నాన్ టీచింగ్ స్టాప్1,733 మంది మొత్తం 12,051 మంది ఉన్నారు. వీరిలో వ్యాక్సిన్ వేసుకున్నవారు టీచింగ్ 9,955, నాన్ టీచింగ్ 1,567, మొత్తం11,522 మంది ఉన్నారు. ప్రత్యేకంగా టీచర్ల కోసం కేటాయించిన స్పెషల్ డ్రైవ్‌లో 3,534 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. కొవిడ్‌తో 598 మంది, గర్భిణులు 74 మంది, హార్ట్ పేషెంట్స్ 15 మంది, ఇతరులు 349 మంది, ఆసక్తిలేక 92 మంది, ఇతర కారణాలతో 293 మంది ఫస్ట్, సెకండ్ డోస్ వేసుకోలేదని విద్యాశాఖ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. 6,678 మంది మొదటి, 3,432 మంది టీచర్లు రెండో డోస్ టీకా వేసుకున్నారు.
ప్రైవేట్ నిర్వాహకులతో సమావేశం..
గురువారం డీఐఈవో కార్యాలయంలో ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ నెల 29వ తేదీ నాటికి తరగతిగదులు, ల్యాబ్స్, టాయిలెట్స్, తాగునీరు, కళాశాల ఆవరణ పరిశుభ్రం చేయాలని డీఐఈవో రవిబాబు ఆదేశించారు.