ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చికిత్స, సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. మానసిక, శారీరక, బహుళ వైకల్యం కలిగిన దివ్యాంగ చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ద్వారా వారి వైకల్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. వారికి తగిన చేయూతనిచ్చి వారు వైకల్యాన్ని జయించేందుకు మార్గం చూపుతున్నది. వివిధ కారణాలతో దివ్యాంగులైన చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం భవిత కేంద్రాలు ఎంతో భరోసానిస్తున్నాయి.
– సత్తుపల్లి, నవంబర్ 8
ఖమ్మం జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా తగిన ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని భవిత(ఐఈఆర్సీ) కేంద్రాలకు చెందిన ఇన్‌క్లూజివ్, ఎక్స్క్యూజివ్ రిసోర్స్‌పర్సన్(ఐఈఆర్పీ)లు ఇంటింటికీ తిరిగి దివ్యాంగుల సమగ్ర అవసరాలను గుర్తించి వారిని భవిత కేంద్రాలకు తరలిస్తున్నారు. చిన్నారులకు వైద్యసేవలతోపాటు విద్యను అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 26 భవిత కేంద్రాల ద్వారా 2,188 మంది చిన్నారులకు చేయూతనిస్తున్నారు. ప్రతి సోమవారం ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. మానసిక, శారీరక వైకల్యం, బహుళ వైకల్యం కలిగిన పిల్లలకు ఉపాధ్యాయులతో ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారు పూర్వ స్థితికి వచ్చేలా ఆత్మవిశ్వాసం కలిగిస్తున్నారు.
జిల్లాలో దివ్యాంగ పిల్లలు…
దృష్టి లోపం 136, అభ్యసన వైకల్యం 174, మెదడు పక్షవాతం 166, బహుళ వైకల్యం 140, మానసిక వైకల్యం 601, చలన వైకల్యం 338, బాషణ వైకల్యం 143, డ్వార్పిజం 11, నరాల బలహీనత 10, తలసేమియా 12, వినికిడి 171, కండరాల బలహీనత 6, న్యూరాజికల్ 3 మొత్తం 2,188 మంది పిల్లలు వైకల్యంతో బాధపడుతున్నారు. వీరందరినీ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో భవిత కేంద్రాల ద్వారా పాఠశాల విద్యాశాఖ తరఫున ఉచిత శిక్షణ ఇస్తున్నారు. శస్త్రచికిత్సలు సైతం ఉచితంగా అందిస్తున్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ప్రతి కేంద్రానికి ఇద్దరిని నియమించి అర్హులైన ఫిజియోథెరపిస్ట్ ద్వారా వారానికి ఒకసారి దివ్యాంగ చిన్నారులకు తగిన చికిత్స అందిస్తున్నారు. ప్రతి కేంద్రంలో ప్రత్యేక కేర్ టేకర్‌ను నియమించి చిన్నారుల అవసరాలను గుర్తిస్తున్నారు. ప్రతి ఐఆర్‌సీపీ ఉపాధ్యాయుడు తనకు కేటాయించిన పాఠశాలకు వెళ్లి అక్కడి దివ్యాంగ విద్యార్థుల పరిస్థితిని గుర్తించి వారి అభ్యసన ప్రవర్తనపై సంబంధిత ఉపాధ్యాయులతో చర్చించి తగిన సూచనలు చేస్తున్నారు. ప్రతి శనివారం పాఠశాలకు రాలేని దివ్యాంగ చిన్నారుల ఇళ్లకు వెళ్లి వారికి శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు ఫిజియోథెరపీతోపాటు స్పీచ్‌థెరపీ చేయిస్తూ మానసిక దివ్యాంగులకు అర్థమయ్యే రీతిలో చదువు నేర్పడంతోపాటు ప్రత్యేక ఉపకరణాల ద్వారా ఆటపాటలతో మెళకువలు నేర్పిస్తున్నారు.
పిల్లలకు అందించే అలవెన్సులు…
మండల కేంద్రాల్లో ఉన్న భవిత కేంద్రాలకు వచ్చే దివ్యాంగ చిన్నారులకు నెలకు రూ.300 చొప్పున అలవెన్స్ అందిస్తారు. ఉచిత మెడికల్ క్యాంపుల ద్వారా చిన్నారుల అవసరాలకు అనుగుణంగా మూడు చక్రాల సైకిళ్లు, రోలేటర్స్ ఉచితంగా అందిస్తారు. క్రమం తప్పకుండా కేంద్రాలకు వచ్చే చిన్నారులకు సదరం సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉచిత బస్‌పాస్‌లు, రైల్వేపాస్‌లు సైతం అందజేస్తారు.
మేలైన సేవలు అందించడమే లక్ష్యం
దివ్యాంగ బాలబాలికలకు మేలైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అందరు పిల్లలతో కలిసిమెలిసి తిరిగేలా కృషిచేస్తాం. భవిత కేంద్రానికి హాజరుకాని పిల్లల ఇంటికి వెళ్లి సేవలందిస్తాం. దివ్యాంగ పిల్లలను తీర్చిదిద్దేందుకు వారి నైపుణ్యాల అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషిచేస్తున్నది. భవిత కేంద్రాల్లో ఆరు నెలల నుంచి 14 ఏళ్లలోపు వయస్సున్న చిన్నారులను చేర్చవచ్చు. గ్రామాల నుంచి చిన్నారులను మండల కేంద్రానికి తీసుకొచ్చి ఉచిత బస్‌పాస్ సౌకర్యం కూడా ప్రభుత్వం కల్పిస్తున్నది. ఇక్కడ ప్రత్యేక శిక్షణ ద్వారా వారిలో ఎంతో మార్పు వస్తోంది.
– సురేశ్‌కుమార్, ఐఈఆర్పీ
ఫిజియోథెరపీతో ఎంతో మేలు
భవిత కేంద్రంలో దివ్యాంగులకు చేసే ఫిజియోథెరపీ వల్ల ఎంతో మేలు చేకూరుతున్నది. గ్రామాల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలి. నెలకు నాలుగురోజులు చిన్నారులకు ఫిజియోథెరపీ చేస్తాం. ప్రతి సోమవారం వారికి అవసరమైన విధంగా ఎక్సర్సైజులు చేయించి వారిలో నైపుణ్యత పెరిగేలా చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను ఆనందంగా ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇటువంటి పిల్లలను భవిత కేంద్రాలు, ప్రత్యేక శిబిరాలకు తీసుకొచ్చి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి.
– రమేశ్, ఫిజియోథెరపిస్ట్
దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ
దివ్యాంగులకు భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించి వారికి అవసరమైన సదరం సర్టిఫికెట్లు సైతం అందజేస్తాం. ఆర్టీసీ వారిని పాఠశాలకు పిలిపించి వారి సహకారంతో ఉచిత బస్‌పాస్‌లు ఇప్పిస్తాం. ఉద్యోగాల్లో 4శాతం రిజర్వేషన్లు సైతం ప్రభుత్వం కల్పిస్తున్నది. జిల్లాలోని 21 మండలాల్లో భవిత కేంద్రాల ద్వారా వారికి ప్రత్యేక ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ తదితర శిక్షణ అందిస్తున్నాం.
– రాజశేఖర్, భవిత జిల్లా సమన్వయకర్త