
డాబాపై ఆకుకూరలు, కూరగాయల సాగు
సేంద్రియ పద్ధతిలో పండిస్తూ సత్ఫలితాలు
ఆదర్శంగా నిలుస్తున్న చెరువు మాధారం ప్రధానోపాధ్యాయిని
నేలకొండపల్లి, ఆగస్టు 25 ;మనకు కూరగాయలు కావాలంటే బుట్ట చేత పట్టుకుని మార్కెట్‌కు వెళ్తాం.. ఎక్కడ పండించారో, ఏయే ఎరువులు వాడారో తెలియకుండానే బేరమాడి మరీ కొంటాం.. వాటిలో వాడిపోయినవి, పుచ్చిపోయినవి ఉంటే ఉసూరుమనుకుని వదిలేస్తాం.. కానీ.. ఈ టీచరమ్మ మనమే ఆకుకూరలు, కూరగాయలు పండిస్తే ఎలా ఉంటుంది? అని ఆలోచన వచ్చి అనుకున్నదే తడవుగా మిద్దెపై మొక్కల పెంపకం ప్రారంభించారు. ఏరోజుకారోజు ఇంటిల్లిపాది తినాలనుకున్న కూరగాయలు, ఆకుకూరలను ఆ తోట నుంచే సేకరిస్తున్నారు.. ఆమే నేలకొండపల్లి మండలం చెరువు మాధారానికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు జాలా హరిత. క్లాసులో పిల్లలతో అక్షరాలు దిద్దించడమే కాదు, ఆమె మిద్దె తోట సాగులోనూ నిష్ణాతురాలు అనిపించుకుంటున్నారు..
సేంద్రియ వ్యవసాయంపై మక్కువ..
చెరువుమాధారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలైన జాలా హరిత విద్యార్థుల బాగోగులు, కుటుంబ సంరక్షణ చూసుకుంటూనే మిద్దె తోటల సాగుపై ఆసక్తి పెంచుకున్నారు. స్వతహాగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె సేంద్రియ వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నారు. ఇంట్లో ఉండే పాత డబ్బాలు, ప్లాస్టిక్ బకెట్లు, థర్మోకోల్ డబ్బాలనే కుండీలు ఉపయోగిస్తూ మొక్కలు పెంచుతున్నారు. కొన్ని మొక్కలకు మార్కెట్లో లభించే గ్రో బ్యాగ్‌లనూ వాడుతున్నారు. ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా వారి ఇంటిపై ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. బెండ, గోరు చిక్కుడు, సొరకాయ, మిర్చి, వంగ, బీర, దొండ, టమాటా, మునగ వంటి కూరగాయలు, పొన్నగంటి, గోంగూర వంటి ఆకుకూరలు, వామి, తులసి వంటి ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. ఇక పూల మొక్కల సంగతి సరే సరి. ఒక్కసారి డాబా పైకి వెళితే చాలు చిన్నపాటి తోట మనకు స్వాగతం పలుకుతుంది.
తాతయ్యే ఆదర్శం..
రసాయనిక ఎరువులు వాడకుండా ఇప్పుడు పంటలు పండించడం చాలా అరుదు. ఇలాంటి సందర్భంలో సాధ్యమైనంత మేరకు సేంద్రియ, ప్రకృతి సేద్యంలో పండించిన కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులకు మంచి ఆహారాన్ని అందిస్తున్నారు. సాగుపై ఆసక్తి ఉన్న హరిత చిన్నప్పడు తన తాతయ్య సైదయ్య వ్యవసాయంపై ఇచ్చిన విలువైన సూచనలను ఇప్పుడు అమలు చేస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయ వృత్తిలోనూ రాణిస్తూ ఉత్తమ టీచర్‌గా అవార్డు అందుకున్నారు. వృత్తిరీత్యా బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజు కొంత సమయాన్ని మొక్కల పెంపకానికి కేటాయిస్తారు.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే..
రెండేళ్ల క్రితం సేంద్రియ పద్ధతిపై అవగాహన పెంచుకుని మిద్దె తోట ప్రారంభించా. మొదట ఆకుకూరల సాగు చేశా. తర్వాత కూరగాయల సాగు ప్రారంభించా. క్రమంగా సాగు వ్యాపకంగా మారింది. ఇప్పుడు ఇంట్లో పూర్తిగా ఆర్గానిక్ కూరగాయలనే వాడుతున్నాం. మిద్దె తోటల పెంచడానికి పెద్దగా ఖర్చూ కావడం లేదు. ఇప్పటికీ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని నేను నమ్ముతాను. చిన్న జాగ్రత్తలు తీసుకుని మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.
-జాలా హరిత,ప్రధానోపాధ్యాయురాలు,చెరువు మాధారం