
ఆడపిల్లల తల్లుల కళ్లల్లో మాటలకందని ఆనందం కన్పిస్తోంది
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
పెనుబల్లి, జూన్ 24: పేదల కష్టసుఖాలు తెలిసిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండలానికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను స్థానిక సప్తపది ఫంక్షన్ హాల్లో గురువారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేందుకు పేద కుటుంబాలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావన్నారు. అలాంటి బాధలను చూసిన సీఎం కేసీఆర్.. వాటిని దూరం చేసేందుకే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. చెక్కులు అందుకున్న ఆడ పిల్లల్ల తల్లుల కళ్లల్లో మాటలకందని ఆనందం కన్పిస్తోందని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఇటీవల సత్తుపల్లి నియోజకవర్గంలోని 7,500 మంది లబ్ధిదారులకు రూ.70 కోట్లు మంజూరయ్యాయని, ఒక్క నియోజకవర్గంలోని పేదలకే ఇంత పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరితే రాష్ట్రంలోని పేదలందరికీ ఎంత మొత్తంలో మేలు కలిగి ఉంటుందో అర్థమవుతోందని అన్నారు. జూలై 1 నుంచి పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఆర్డీవో సూర్యనారాయణ, జడ్పీటీసీల ఫోరం జిల్లా కన్వీనర్ చెక్కిలాల మోహన్‌రావు, కల్లూరు ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, తహసీల్దార్ రమాదేవి, సర్పంచ్లసంఘం మండల అధ్యక్షుడు మందడపు అశోక్‌కుమార్, సర్పంచ్‌లు తావూనాయక్, పంతులి, సీడీసీ చైర్మన్ భూపాల్ రెడ్డి, సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ సత్యావతి, నాయకులు వినీల్, సురేశ్‌బాబు, తాతారావు, ప్రసాద్, రవి, నాగదాసు, అప్పారావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.