
డెంగీ హైరిస్క్ ప్రాంతాల్లో ప్రత్యేకాధికారులు పర్యటించాలి
జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల సమావేశంలో ఖమ్మం కలెక్టర్
మామిళ్లగూడెం, ఆగస్టు 23: చిన్నారులను న్యుమోనియా నుంచి రక్షించుకునేందుకు జిల్లాలో పీసీవీ న్యుమోనియా టీకాను అందుబాటులోకి తెచ్చామని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్డేలో చిన్న పిల్లల టీకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులకు డీఎంహెచ్వో డాక్టర్ మాలతి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్క డోసుకు రూ.3 వేలు తీసుకునే టీకాను ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితోపాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. చిన్నారులందరికీ వ్యాక్సిన్ ఇప్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాక్సిన్ గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వివరిస్తూ మూడు డోసుల్లో చిన్నారులకు వ్యాక్సిన్ వేస్తామని, అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఆరు వారాలలోపు వారికి ఒకటో డోసు, 14 వారాలకు రెండో డోస్, 9 నెలలకు బూస్టర్ డోసు వేయనున్నట్లు వివరించారు. టీకా వేయడం వల్ల 80 శాతం పిల్లలకు రక్షణ లభిస్తుందన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అలివేలు, జిల్లా ప్రధానాసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ బీ.వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో అప్పారావు పాల్గొన్నారు.
హైరిస్క్ ప్రాంతాల్లో పర్యటించాలి
జిల్లాలో డెంగీ హైరిస్క్ ప్రాంతాల్లో మండల ప్రత్యేకాధికారులు పర్యటించి నియంత్రణ చర్యలను ముమ్మరం చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. డెంగీ వ్యాప్తిని అరికట్టే ముందస్తు చర్యలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సోమవారం పలు సూచనలు, ఆదేశాలు చేశారు. రానున్న పదిహేను రోజులపాటు హైరిస్క్ ప్రాంతాలతోపాటు జిల్లా వ్యాప్తంగా డ్రై డే కార్యక్రమాలు నిరంతరాయంగా చేపట్టాలని సూచించారు. జిల్లాలో డెంగీ కేసులను పూర్తిగా తగ్గించేందుకు అనుబంధ శాఖల అధికారులు, మండల ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దోమల వ్యాప్తిని అరికట్టాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.