
మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం
కలెక్టర్ ఖాతాలో నిధులు జమ
హర్షం వ్యక్తం చేస్తున్న దళితులు
దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం, డిసెంబర్21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;దళితబంధు పథకం అమలులో భాగంగా ముందుగానే ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఎస్సీ కార్పొ రేషన్ నిధులను విడుదల చేసింది. నిధులను ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది.దళిత బంధు పథకంలో భాగంగా చింతకాని మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ మండలానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం దళిత బంధు నిధులను విడుదల చేసింది. మండలంలో దళిత బంధును పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులు మండలంలో దళిత బంధు పథకానికి అర్హులైన వారిని గుర్తించడంతోపాటు వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నేతృత్వంలో కలెక్టర్ వీపీ గౌతమ్ చింతకాని మండలంలో దళిత బంధుకు అమలుకు తీసుకోవాల్సిన చర్యల పై పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
మండలంలో ఐదు వేల కుటుంబాలు
చింతకాని మండలంలో దాదాపు 5 వేల కుటుంబాలకు దళిత బంధు వర్తించే అవకాశం ఉంది. ఆయా కుటుంబాలు ఎంచుకున్న స్వయం ఉపాధిపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. చింతకాని మండలంలో దళిత బంధు అమలు కోసం ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఖమ్మం కలెక్టర్ బ్యాంకు ఖాతాలోకి రూ.100 కోట్ల నిధులు జమ చేసింది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందే కుంటుంబాలకు ఆసక్తి ఉన్న రంగాల్లో ఉపాధి కల్పించేందుకు అధికారులు అవగాహన కల్పించారు.
ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారులు
చింతకాని మండలంలోని 26 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి దళిత బంధు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. వీరు లబ్ధిదారులతో చర్చించి వారు ఎంచుకున్న ఉపాధికి సహాయ సహకారాలు అందించనున్నారు. గ్రామ స్థాయిలో ఆరుగు దళితులు, మండల స్థాయిలో 15 మందితో దళితులతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి విడుదల చేయడంతో చింతకాని మండలంలోని దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
చింతకాని మండలంలో దళిత బంధు అమలు కోసం మరో రూ.100 కోట్ల నిధులు విడుదల చేయడం హర్షనీయం. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. దళిత బంధు నిధులను సద్వినియోగం చేసుకునే ఆర్థికాభివృద్ధి సాధించాలి.