
మొదటిసారి బొగ్గు నిక్షేపాలు ఇక్కడే వెలికితీత
పూసపల్లి మైన్ నుంచే బొగ్గుబావుల ప్రస్థానం మొదలు
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సంస్థ విస్తరణ
నాడు కఠిన పరిస్థితులు.. నేడు యాంత్రీకరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం
ఇల్లెందు, డిసెంబర్ 21 : బొగ్గుట్ట.. బొగ్గుబావుల ప్రస్థానం మొదలైంది ఇక్కడే.. భూగర్భ గనుల నుంచి ఓపెన్‌కాస్టుల దాకా సాగిన సింగరేణికి తొలి అడుగు ఇక్కడే.. ఎన్నో రాష్ర్టాలకు వెలుగులు అందిస్తున్న సంస్థ.. నాడు ఎన్నో కఠిన పరిస్థితులను, ప్రమాదాలను ఎదుర్కొని.. నేడు రక్షణే ప్రథమ కర్తవ్యంగా నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నది. ఏటా రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా చేస్తూ లాభాల బాటన పయనిస్తున్నది. ఇటు థర్మల్, సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తూ తెలంగాణ రాష్ర్టానికే మణిహారంగా మారింది. సీఎం కేసీఆర్ సారథ్యంలో సీఎండీ శ్రీధర్ పర్యవేక్షణలో దినదినాభివృద్ధి సాధిస్తూ సిరులవేణిగా మారిన సింగరేణి ఈనెల 23న ఆవిర్భావ దినోత్సవం జరుపుకొంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం..
గతంలో భద్రాచలం పుణ్యాక్షేత్రానికి భక్తులు వివిధ ప్రాంతా ల నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లేవారు. కాలి నడక, ఎడ్లబండ్ల మీద ప్రయాణం సాగించేవారు. అప్పుడు అంతా దట్టమైన అడవే. అక్కడక్కడా భక్తబృందాలు విశ్రాంతి తీసుకునేవారు. ఇల్లెందు అటవీ ప్రాంత సమీపంలో విశ్రాంతి తీసుకుంటూ, వంట చేసుకుంటున్న ఓ బృందానికి రాళ్లు మండు తూ కనిపించాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న సమీప క్రిస్టియన్ మిషనరీ బ్రిటీష్ అధికారులకు సమాచారం అందిం చింది. రంగంలో దిగిన నాటి బ్రిటీష్ ఇంజినీర్ విలియమ్స్ కింగ్ 1871లో బొగ్గు అన్వేషణ ప్రారంభించారు. 20 ఏండ్ల సు దీర్ఘ పరిశోధన అనంతరం 1889లో ఆయన కృషి ఫలించింది. తొలిసారిగా ఇల్లెందులో బొగ్గును బయటకు తీసి చరిత్ర సృష్టించారు. ఈ కారణంగా ఇల్లెందు(బొగ్గుట్ట)లో బొగ్గు తవ్వకాలు చేపట్టారు.
తొలుత దక్కన్ కంపెనీగా..
మొట్టమొదటగా దీనికి దక్కన్ కంపెనీగా పేరు నమోదు చేసి ఇంగ్లాండ్‌లో కేంద్ర కార్యాలయాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత 1921లో దక్కన్ కంపెనీ కేంద్ర కార్యాలయాన్ని మద్రాస్‌కు తరలించారు. దీనికే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా నామకరణం చేశారు. ఇలా స్థాపించబడిన సింగరేణి కాలరీస్ కంపెనీ ది నదినాభివృద్ధి చెందుతూ 1927 నాటికి ఆదిలాబాద్ జిల్లాకు విస్తరించింది. ఆదిలాబాద్ జిల్లాలోని తాండూరు వద్ద ప్రప్రథమంగా బొగ్గు త్రవ్వకం ప్రారంభమైంది. ఆ తర్వాత అపారమైన బొగ్గు నిల్వలుగల గోదావరిలోయ ప్రాంతాన్ని డాక్టర్ విలయమ్స్ కింగ్ ఒక పంటగా రూపొందించారు. సుమారు 350కిలోమీటర్ల ప్రాంతం వరకు బొగ్గు నిల్వలు విస్తరించి ఉన్నట్లు వెల్లడించారు. నాటి ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో బొగ్గు విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉభయగోదావరి జిల్లాలో 2వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో బొగ్గు వ్యాపించి ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీ జిల్లాలన్నింటితో కలిపి 4వేల మిలియన్ టన్నులకు పైగా బొగ్గు నిల్వలు ఉన్నట్లు అం చనా వేశారు. సింగరేణి చేపట్టిన సర్వేలో 9300మిలియన్ ట న్నుల బొగ్గు ఉన్నట్లు అంచనా వేసింది. ఇప్పటి వరకు సింగరే ణి 2400 మిలియన్ టన్నులే తవ్వకాల ద్వారా వెలికితీసింది.
మరిచిపోలేని సంఘటనలు..
బొగ్గు గనులు ఆవిర్భవించిన తరువాత సుమారు 45 ఏండ్ల పాటు బావుల్లో నీరు, గాలి, వెలుతురు వంటి కనీస సౌకర్యాలు లేవు. చీకటి గుహల్లో ప్రాణానికి కనీస రక్షణ, భద్రత లేకుండా కార్మికులు పనిచేసేవారు. 1936లో కొత్తగూడెంలోని బర్టీఫిట్, అండ్రూస్నెం.1 ఇైంక్లెన్, అండ్రూస్ నెం.2ఇైంక్లెన్ల బావులలో బొగ్గు త్రవ్వకం ప్రారంభమైంది. అప్పుడు ఇల్లెందులో పనిచేసే కార్మికులందరినీ కాంట్రాక్టర్లతో సహా కొత్తగూడెం తరలించారు. నాడు కిరోసిన్‌తో వెలిగే దీపాలే కార్మికులకు దిక్కు. బావుల్లో విపరీతమైన పొగ, వేడి ఉండేవి. గాలి, వెలుతురు, నీరు మచ్చుకైన కానరాకపోయేవి. బావుల్లో ఊటల ద్వారా వచ్చే నీటిని కా ర్మికులు తాగేవారు. రక్షణ సదుపాయాలు అసలే ఉండేవి కావు. కార్మికుడు బావిలో పనిలో వెళ్తే తిరిగి బయటికి వచ్చేవరకు ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉండేది. చేసే పనికి భద్రత లేదన్న భయంతోపాటు కష్టానికి ఇచ్చే బేడాపావులా చాలిచాలక దుర్భర జీవితాన్ని గడిపేవారు. అప్పుడు దినసరి కూలీ బేడా, మూణాల, సావలా, అరణాలు ఉండేవి. కాంట్రాక్టర్ల దోపిడీ, దౌర్జన్యం నరకయాతనగా ఉండేది. కార్మికులు పారిపోకుండా రైల్వే స్టేషన్ల వద్ద కాంట్రాక్టర్లు కాపలా ఉండేవారు. ఎవరైనా పారిపోయేందుకు ప్రయత్నించినా, ఎదురు తిరిగినా చిత్రహింసలకు గురిచేసేవారు.
ఇల్లెందులో పెనుప్రమాదం
ఇల్లెందు స్ట్రట్‌ఫిట్ గనిలో 12 మార్చి 1938న మొహరం పండుగ రోజు గ్యాస్ ప్రమాదం సంభవించింది. ఆ సమయం లో ముగ్గురు తెల్లదొరలతో సహా వందలాది మంది కార్మికులు మరణించారు. ఈ కారణంగా 30కి పైగా బావులు నిలుపుదల చేశారు. ఉప్పాలాల్‌పాసీ అనే కార్మికుడి నేతృత్వంలో నాడు 8 రోజుల సమ్మె జరిగింది. ప్రతిఫలంగా వరంగల్ జిల్లా నుంచి ఉప్పాలాల్‌పాసీని బ్రిటీష్ అధికారులు, నిజాం నవాబ్ ప్రవేయంతో బహిష్కరించారు. ఈ ఘటనలు సింగరేణిలో మరిచిపోలేని సంఘటనలుగా గుర్తుండిపోయాయి. అప్పటి నుంచి ఇల్లెందు ఏరియాలో ప్రతి శుక్రవారం కార్మికులకు సెలవు ది నంగా ప్రకటిస్తూ వచ్చారు. నేటికీ అది కొనసాగుతున్నది.
వేతనాల పెరుగుదల
బేడా, మూణాల, పావలా,అరణాల కూలి జీవితంతో సింగరేణి కార్మికులు దుర్భర జీవితాన్ని గడిపేవారు. కార్మిక వర్గానికి కంపెనీ ద్వారా బియ్యం, గోధుమలు, జొన్నలు, పప్పుదినుసులు, తదితర నిత్యావసర వస్తువులను రేషన్‌గా ఇప్పించేవారు. 1946లో రేగా కమిటీ ద్వారా రోజుకు ఒక్క రూపాయి వేతనం పెరిగింది. 1949లో జాదవ్ కమిటీ ద్వారా రోజుకు రూ. 3 వేతనం పెరిగింది. 1956లో ముజుందార్ అవార్డు ద్వారా రోజుకు రూ. 5 కంపెనీ చెల్లించింది. 1959 లో లేబర్ అపీలియట్ ట్రిబ్యునల్ ద్వారా రోజుకు రూ.10లు వేతనం పెరిగింది. 1961లో దాస్ గుప్తా అవార్డు ద్వారా ఇండ్లు, కరంట్, నీటి సౌకర్యాలు, వెల్ఫేర్, క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి.
తలమానికంగా సింగరేణి..
ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో కుటుంబాలకు అండగా నిలు స్తున్న సింగరేణి రాష్ర్టానికి తలమానికంగా మారింది. సింగరేణి చరిత్రలో మొదట 60 ఏండ్లు 60మీటర్ల లోతు మే రకే బొగ్గు తవ్వకాలు జరిగాయి. ప్రస్తుతం 700 మీటర్ల లోతు నుంచి బొగ్గు వెలికి తీస్తున్నారు. బొగ్గు ఆధారంగా నడిచే విద్యుత్, సిమెంట్, ఎరువులు తదితర పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. సాధారణ గ్రామాలుగా ఉన్న గోదావరిఖని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీ రాంపూర్ నేడు పారిశ్రామిక పట్టణాలుగా ఆవిర్భవించాయి. సింగరేణి బొగ్గు పక్క రాష్ట్రాలతో పాటు ప్రపంచం నలుమూలలకు ఎగుమతి చేయడం ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొ త్తంలో ఆదాయం సమకూరుతున్నది.