
ఏర్పాటుపై పూర్తిస్థాయినివేదిక అందజేత
నిధుల లభ్యతపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
ఖమ్మం, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మరో ముందడుగు పడింది. విమానాశ్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాల్వంచ మండలం గుడిపాడు వద్ద ప్రతిపాదించిన భూమికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూమి అనువైనదిగా భావించి గ్రీన్‌ఫీల్డ్‌గా గుర్తించింది. ఈ ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణానికి సానుకూలత వ్యక్తం చేసింది. అయితే, నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భద్రాద్రి జిల్లాలో విమానాశ్రయ నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. పాల్వంచ మండలం గుడిపాడు వద్ద ప్రతిపాదించిన భూమికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విమానాశ్రయ నిర్మాణానికి సాంకేతిక అడ్డంకులు తొలగినట్లు అయ్యింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో విమానాశ్రయ నిర్మాణాలకు అనుకూలమైన స్థలాలను పరిశీలించింది. ఇందులో భాగంగా పాల్వంచ మండలం గుడిపాడు వద్ద రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన భూమి అనువైనదిగా భావించి గ్రీన్‌ఫీల్డ్‌గా గుర్తించింది. ఈ ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణానికి సానుకూలత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఆరు విమానాశ్రయాలకు సంబంధించి ఏఏఐ(ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా) నేలస్వభావాలు, మట్టినమూనాలను సేకరించింది. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్, భవిష్యత్‌లో పెరగనున్న ట్రాఫిక్‌పై రాష్ట్ర అధికారులతో కలిసి సమగ్ర సర్వే నిర్వహించింది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించిన సర్వే నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. అనుకూలతలు, ప్రతికూలతల నివేదిక రూపొందించింది. టెక్నో ఎకనామిక్ ఫీజ్‌బిలిటీ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. విమానాశ్రయానికి సంబంధించిన భూములకు సైట్ క్లియరెన్స్ ఇవ్వాలని ఏఏఐ అధికారులు తమ నివేదికలో ప్రభుత్వాన్ని కోరారు. అయితే, విమానాశ్రయ నిర్మాణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
భక్తులు, పర్యాటకులు పెరిగే అవకాశం..
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగూడెం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. విమానాశ్రయం ఏర్పాటుతో వీరి సంఖ్య మరింత పెరగనున్నది. ఈ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుపై కేంద్రం రైట్స్ అనే సాంకేతిక సంస్థతో గతంలోనే సర్వే నిర్వహించింది. తొలుత కొత్తగూడెం సమీపంలోని పునుకుడుచెలక వద్ద నిర్మించాలని భావించినా.. వివిధ సాంకేతిక కారణాలతో అక్కడ సాధ్యం కాదని తేల్చింది.
నిర్మాణానికి రూ.439 కోట్లు అవసరం
విమానాశ్రయం నిర్మాణానికి సుమారు రూ.439 కోట్లు అవసరమవుతాయని అంచనా. నిర్మాణం కోసం ఫేజ్-1లో 408 ఎకరాల స్థలం అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పేర్కొన్నారు. 40 నుంచి 50 సీట్ల సామర్థ్యం కలిగిన చిన్న విమానాలు కొత్తగా నిర్మించే విమానాశ్రయాల్లో దిగే అవకాశం ఉంది. పాల్వంచలో నిర్మించేది డొమెస్ట్రిక్ విమానాశ్రయంగా వ్యవహరిస్తారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి నిధుల లభ్యత వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విమానాశ్రయానికి, విమానాశ్రయానికి మధ్య కనీసం 200 కిలోమీటర్ల దూరం ఉండాలనే నిబంధన ఉంది. హైదరాబాద్‌లోని జాతీయ విమానాశ్రయానికి, పాల్వంచలో నిర్మించే ఎయిర్‌పోర్టుకు దాదాపు 300 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో పాల్వంచలో విమానాశ్రయ నిర్మాణానికి సాంకేతికంగా గ్రీన్‌సిగ్నల్ లభించినట్లేనని అధికారులు చెబుతున్నారు.
పలుమార్లు విజ్ఞప్తి
భద్రాద్రి జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పలు సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
1000ఎకరాల ప్రభుత్వ భూమి సిద్ధం
పాల్వంచ మండలం గుడిపాడులో పిల్లవాగు సమీపంలో 999 సర్వే నంబరులో 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని విమానాశ్రయం కోసం రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. ఈ స్థలాన్ని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సర్వే నిర్వహించి గ్రీన్‌ఫీల్డ్‌గా గుర్తించారు. విమానాశ్రయం ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. జిల్లాలో వచ్చే 20 ఏళ్లకు విమానయానపరంగా ప్రయాణికుల శ్రాతాన్ని అంచనా వేస్తూ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తమ నివేదికలో వివరించారు. దేశీయ విమానాలను నడపొచ్చని నివేదికలో పేర్కొన్నారు. కేంద్రం ఎయిర్‌పోర్టులకు అనుమతి ఇచ్చినా నిర్మాణ వ్యయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. దీంతో విమానాశ్రయ నిర్మాణాన్ని ఏ ప్రాతిపదికన చేపట్టాలన్న అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం పరిశీలిస్తున్నట్లు సమాచారం.