ప్రచార ఆర్భాటం కోసం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్ సర్కార్ బియ్యం కేటాయింపులో నిర్లక్ష్యం చేస్తున్నది. దీంతో కొత్త రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులకు ప్రయోజనం లేకుండాపోయింది. గత నెల 14వ తేదీన కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులకు ఒకేసారి కార్డులు అందజేయకుండా విడతల వారీగా అందజేస్తున్నారు. అయితే బియ్యం కేటాయింపుల్లో జాప్యం చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కార్డుల పంపిణీని కొనసాగిస్తుందనే అనుమానం లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 21,646 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఇంకా 6,749 దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి ఎప్పుడు మోక్షం లభిస్తుందో వేచిచూడాలి. – అశ్వారావుపేట, ఆగస్టు 4
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. మే 25వ తేదీ నాటికి మంజూరైన కార్డులకు మాత్రమే జూన్‌లో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 2,93,754 లబ్ధిదారులకు 443 దుకాణాల ద్వారా సివిల్ సైప్లె అధికారులు 50 నుంచి 60 వేల క్వింటాళ్ళ బియ్యం పంపిణీ చేశారు. మే 25వ తేదీ తర్వాత దరఖాస్తు చేసుకున్న పేదలకు జూలై నెలలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసింది.
కార్డులైతే మంజూరు చేశారు గానీ అందుకు అవసరమైన బియ్యం కేటాయింపులు చేయలేదు. బియ్యం కేటాయింపులు లేకుండా కార్డులు పంపిణీ చేస్తే ప్రయోజనమేంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలల బియ్యం జూన్‌లోనే పంపిణీ చేయటం వల్ల ఆగస్టు వరకు కేటాయింపులు పూర్తి అయ్యాయి. అంటే కొత్త రేషన్ కార్డుదారులకు జూలై, ఆగస్టు నెలల బియ్యం అందే పరిస్థితులు లేవు. సెప్టెంబర్ కేటాయింపులతోనే కొత్త రేషన్ కార్డులకు బియ్యం ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.
జిల్లావ్యాప్తంగా 21,646 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. మొత్తం 30,539 దరఖాస్తులు స్వీకరించిన అధికారులు 2,144 అప్లికేషన్లను తిరస్కరించారు. 21,646 అర్హులను ఎంపిక చేసి కొత్తకార్డులు మంజూరు చేశారు. ఇంకా 6,749 దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిలో డీఎస్వో వద్ద 2,230, గిర్దావర్ల వద్ద 4,209, తహసీల్దార్ల వద్ద 310 దరఖాస్తులు ఉన్నాయి. వీటికి ఎప్పుడు మోక్షం లభిస్తుందో చూడాలి. వీటితోపాటు కుటుంబ సభ్యుల చేర్పుల కోసం మరో 1,776 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో డీఎస్వో వద్ద 1,026, తహసీల్దార్ల వద్ద 111, గిర్దావర్ వద్ద 639 చొప్పున దరఖాస్తులు ఉన్నాయి. మొత్తం 45,750 దరఖాస్తులకు గాను 40,894 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. 3,080 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు.
కొత్త రేషన్ కార్డులను పండుగ వాతావరణంలో పంపిణీ చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు బియ్యం కేటాయింపుల్లో మాత్రం శ్రద్ధ తీసుకోలేదు. కార్డుదారుల్లోని ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం 6 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే పాత కార్డుదారులందరికీ జూన్ నెలలోనే ఆగస్టు నెల వరకు మూడు నెలల బియ్యం పంపిణీ చేసింది. దీంతో కొత్త కార్డుదారులు బియ్యం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ, అధికారులు మాత్రం సెప్టెంబర్ నెల కోటాలో కొత్త రేషన్ కార్డులకు బియ్యం కేటాయింపులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే ఈ రెండు నెలల బియ్యం కొత్త కార్డుదారులు కోల్పోవచ్చు. ఇదే అనుమానాన్ని అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరో నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.
ఏళ్ల తరబడి ఎదురుచూపుల తర్వాత కొత్త రేషన్ కార్డు మంజూరైంది. ఇంకా బియ్యం కేటాయింపు జరగలేదు. బియ్యం కోసం ఎదురుచూస్తున్నాం. ఆగస్టు నెల నుంచి బియ్యం ఇస్తారని ఆశిస్తున్నాను.
– మాత్రపు అంజలి, లబ్ధిదారు, అశ్వారావుపేట
కొత్త రేషన్ కార్డులకు కూడా ప్రభుత్వం బియ్యం కేటాయించాలి. చాలా మంది కార్డుదారులు దు కాణానికి వచ్చి బియ్యం ఎప్పుడిస్తారని అడుగుతున్నారు. కొత్త కార్డుల సంఖ్య ఆధారంగా బియ్యం కేటాయించాలి.
– కొడాలి వెంకటేశ్వరరావు, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, అశ్వాపురం