
ఫొటోలు తీసిన అటవీశాఖ అధికారులు
సోషల్ మీడియాలో వైరల్
గ్రామస్తులను అప్రమత్తం చేసిన అధికారులు
కొత్తగూడెం/ టేకులపల్లి, నవంబర్ 20: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని జంగాలపల్లి అటవీప్రాంతంలో శనివారం తెల్లవారుజామున రహదారి దాటుతూ పులి కనిపించింది. అటవీశాఖ రేగళ్ల రేంజర్ జశ్వంత్ప్రసాద్, బీట్ ఆఫీసర్ శోభన్ కారులో వెళ్తూ ఈ ఫొటోలు తీశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పులి కలకలంతో అటవీప్రాంత గూడేల్లో నివసిస్తున్న గిరిజనులు భయభ్రాంతులకు గురయ్యారు. అటవీశాఖ డివిజనల్ ఫారెస్ట్ అధికారి అప్పయ్య, టేకులపల్లి రేంజర్ ముక్తార్ హుస్సేన్ పులి సంచరించిన ప్రాంతాలను పరిశీలించారు. బర్లగూడెం, మెట్లగూడెం, జంగాలపల్లి, కొప్పురాయి, సిద్ధారం గ్రామస్తులకు పులి సంచారంపై అవగాహన కల్పించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అడవుల్లో పశువులను కట్టేయవద్దన్నారు. గ్రామస్తులు ఒంటరిగా అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని, పులి గురించి ఎలాంటి సమాచారం అందినా తమకు తెలియజేయాలన్నారు. ప్రస్తుతం పులి టేకులపల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీశాఖ భావిస్తున్నది.
సిర్పూర్ కాగజ్నగర్ నుంచి బయల్దేరి..
భద్రాద్రి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతున్నది. వారం రోజుల క్రితం సిర్పూర్ కాగజ్నగర్ నుంచి బయల్దేరిన పులి అటవీ ప్రాంతం గుండా భద్రాద్రి జిల్లాకు వచ్చినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. తొలుత మణుగూరు నియోజకవర్గంలో సంచరించిన పులి పశువులపై దాడి చేసి చంపింది. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులి పాద ముద్రలను సేకరించారు. శుక్రవారం కొత్తగూడెం పరిసర ప్రాంతాలకు చేరుకున్న పులి లక్ష్మీదేవిపల్లి మండలంలోని తోకబంధాలలో లేగదూడను చంపింది. ఈ ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.