
సాగైన పంటలు, రైతుల వివరాలు సేకరిస్తున్న వ్యవసాయశాఖ
పొలాలను సందర్శిస్తున్న ఏఈవోలు
దిగుబడి అంచనాకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు
నిరంతర పర్యవేక్షణకు మూడంచెల విధానం
అసలైన రైతుకే మద్దతు ధర
ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 20 ;అన్నదాతలు ఏ పంటలు వేస్తున్నారు.? ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.? ఏ పంటలు వేశారు.? ఏ సర్వే నంబర్ భూమి సాగు చేస్తున్నారు..? పట్టాదారు పాస్‌పుస్తకం, సాగు రైతు, ఆయన తండ్రి పేరు, ఇరిగేషన్ విధానం, రైతు సెల్‌నంబర్ ఇలా పలు వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరించి ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నారు. దీని ద్వారా దిగుబడులను అంచనా వేసి మార్కెటింగ్‌లో సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పంటల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేకంగా పోర్టల్‌ను రూపొందించింది. ఖమ్మం జిల్లాలో వారంరోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. నేటి వరకు 24,213 మంది రైతులు 77,384 ఎకరాల్లో సాగు చేసిన పంటల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వారం రోజుల నుంచి పంటల నమోదు ప్రక్రియ కొనసాగతున్నది. నేటి వరకు 21 మండలాలకు సంబంధించి 24,213 మంది రైతులు 77,384 ఎకరాల్లో సాగు చేసిన పంటల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. 10 అంశాల ప్రాతిపాదికన ఈ సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే నంబర్ నుంచి మొదలు కొని పట్టాదారు పాస్‌పుస్తకం, సాగు రైతు, తండ్రి పేరు, సాగు చేసిన పంట, విస్తీర్ణం, ఇరిగేషన్ విధానం, రైతు సెల్ నంబర్ తదితర అంశాలను సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. వానకాలం సీజన్లో ఎన్నిరకాల పంటలు సాగు చేశారు. తద్వారా వచ్చే దిగుబడులను అంచనా వేసి మార్కెటింగ్‌లో సమస్యలు ఉత్పన్నం కాకుండా తెలంగాణ సర్కార్ చర్యలు చేపడుతున్నది.
పర్యవేక్షణ బాధ్యత ఏవో,ఏడీఏ, డీఏవోలకు..
జిల్లా వ్యాప్తంగా పంటల నమోదు ప్రక్రియలో 129 మంది వ్యవసాయశాఖ విస్తరణ అధికారులు పాల్గొంటున్నారు. సాగు పంటలతోపాటు ఉద్యాన, పట్టు పరిశ్రమ వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ మరింత పారదర్శకంగా సాగాలనే ఉద్దేశంతో పర్యవేక్షణ బాధ్యత ఆయా మండలాల వ్యవసాయశాఖ అధికారులు, డివిజన్ వ్యవసాయశాఖ సహాయసంచాలకులు, జిల్లా వ్యవసాయశాఖ అధికారికి అప్పగించారు. పర్యవేక్షణ అధికారి స్వయంగా పంట పొలాలను సందర్శించి మరోమారు తమకు కేటాయించిన సాగు విస్తీర్ణాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. పరిశీలన చేసిన సాగు భూమి, రైతుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి నివేదిక తయారు చేయాలి. వీరితోపాటు ఎప్పటికప్పుడు తమశాఖకు సంబంధించిన ఉద్యాన, పట్టుపరిశ్రమ సాగు వివరాలపై ఆరా తీసి పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఉద్యానశాఖ అధికారులకు అప్పగించారు. దీంతో దాదాపుగా 150 మందికి పైగా అధికారులు పంటల నమోదు ప్రక్రియలో భాగస్వాములయ్యేలా ప్రణాళిక తయారు చేశారు.
మార్కెటింగ్‌లో అవరోధాలు కలగకుండా..
వానకాలం సీజన్లో పంట ఉత్పత్తులు చేతికి వచ్చే అవకాశం ఉంది. దీంతో సర్కార్ మార్కెట్లలో ఏర్పాట్లతోపాటు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఏటా ప్రభుత్వం పత్తి కొనుగోలుకు సీసీఐ కేంద్రాలు, అపరాలు, మక్క కొనుగోలుకు మార్క్‌ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. ఐకేపీ, సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నది. గతంలో పంటల నమోదు ప్రక్రియ వివరాలు లేకపోవడంతో కొనుగోలు విషయంలో సమస్యలు ఎదుర్కొనేది. కచ్చితమైన అంచనా లేకపోవడంతో పంటను మార్కెట్లకు, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు ఇబ్బందిపడేవారు. దిగుబడుల వివరాలు తెలుసుకొని అందుకు అనుగుణంగా కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో క్రాఫ్ బుకింగ్ ప్రక్రియ చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో దళారులు, బినామీలకు అవకాశం లేకుండా సాగు చేసిన రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో రైతుల పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. దీంతో గడిచిన రెండు, మూడేళ్ల నుంచి అసలైన రైతులకు మద్దతు ధర లభిస్తున్నది.
ప్రతి పంట ఆన్లైన్లో నమోదు
రైతు సాగు చేసిన పంటను ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. సర్వే నంబర్లతోపాటు పట్టాదారు పాస్ పుస్తకం, రైతుల వివరాలు, విస్తీర్ణం తదితర అంశాలపై సర్వే జరుగుతున్నది. వచ్చే నెల 15లోపు పూర్తి స్థాయిలో పంటల నమోదు ప్రక్రియ పూర్తి చేసి నివేదిక తయారు చేస్తాం
-ఎం విజయనిర్మల, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఖమ్మం