
ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి
అశ్వారావుపేట, ఆగస్టు 20: రాష్ట్రంలో ఆయిల్‌పాం రైతులు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని నారంవారిగూడెం ఆయిల్ పాం నర్సరీలో శుక్రవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావుతో కలిసి రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయిల్ పాం గెలల ధర మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉన్నదన్నారు. రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే సర్కార్ అనేక సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పాం విస్తరణకు చర్యలు తీసుకుంటున్నదన్నారు.టీఎస్ ఆయిల్ ఫెడ్ తో పాటు మరికొన్ని ప్రైవేటు కంపెనీలు ఆ బాధ్యతలు తీసుకున్నాయన్నారు. సాగు ప్రోత్సాహానికి రూ.11,040 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆయిల్ పాం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఆయిల్ పాం రైతుల సంఘం నాయకులు ఆలపాటి రామచంద్రప్రసాద్, వెంకటేశ్వరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ జూపల్లి రమేశ్, ఆయిల్ ఫెడ్ డివిజనల్ మేనేజర్ బాలకృష్ణ, అశ్వారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్ శ్రవంతరెడ్డి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరావు, దమ్మపేట, అశ్వారావుపేట సొసైటీ అధ్యక్షులు జోగేశ్వరరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.