శనివారం 27 ఫిబ్రవరి 2021
Khammam - Jan 13, 2021 , 02:11:18

కుల వృత్తులకు జీవం

కుల వృత్తులకు జీవం

  • బీసీలకు అండగా తెలంగాణ సర్కార్‌
  • మోడల్‌ స్టేడియంగా సర్దార్‌ పటేల్‌ స్టేడియం
  • ఆత్మగౌరవ వేదికగా బీసీ భవన్‌
  • మంత్రులు అజయ్‌కుమార్‌, శ్రీనివాస్‌గౌడ్‌
  • నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

ఖమ్మం, జనవరి 12: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయాలతో రాష్ట్రంలో కుల వృత్తులు జీవం పోసుకున్నాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. కార్పొరేషన్‌ పరిధిలోని రామన్నపేటలో ఐదు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన తాటి, ఈత వనాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సభలో మాట్లాడారు. బీసీలు ఐక్యంగా ఉండి రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలన్నారు. చట్టసభల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్‌ వరకు లక్షలాది మందికి పదవులు కట్టబెట్టారన్నారు. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంలో రూ. 2 కోట్ల వ్యయంతో బీసీ భవన్‌ కేటాయించారన్నారు. గతంలో గౌడలను ఎవరూ పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్‌ కల్లు గీత పన్ను రద్దు చేశారన్నారు.

సకల వసతులతోసర్దార్‌ స్టేడియం...

సర్దార్‌ పటేల్‌ స్టేడియాన్ని జాతీయ, అంతర్జాతీయ క్రీడలు నిర్వహించే విధంగా తీర్చిదిద్దారని మంత్రి అజయ్‌ అన్నారు. స్టేడియంలో నూతనంగా నిర్మించిన రెండో అంతస్తు భవనంతో పాటు రూ.1.30 కోట్లతో ఏర్పాటు చేసిన స్కేటింగ్‌ రింగ్‌, క్రికెట్‌ టర్ఫ్‌ వికెట్‌, సాండ్‌ ట్రాక్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో వంద స్టేడియాలు మంజూరు చేసామని, వీటిలో 40కి పైగా పూర్తి చేశామన్నారు. రాష్ర్టాన్ని టూరిజం హబ్‌గా మారుస్తామన్నారు. రాత్రింబవళ్లు క్రీడలు నిర్వహించేందుకు నైట్‌ విద్యుత్‌ టవర్స్‌ను మంజూరు చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను మంత్రి అజయ్‌ కోరారు.

తెలంగాణ ప్రభుత్వంలోనే గౌడలకు గౌరవం.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రాష్ట్రం ఆవిర్భావించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గౌడలకు గౌరవం దక్కిందిని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కల్లు గీత వృత్తికి ఘన చరిత్ర ఉందన్నారు. పూర్వ కాలంలో సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ బీసీల ఐక్యత, గౌడ సామాజిక వర్గం కోసం పోరాటం చేశారన్నారు. తాటి చెట్లను రక్షించుకోలేక గౌడలు గతంలో వలస వెళ్లారన్నారు. సీఎం కేసీఆర్‌ చొరవతో రాష్ట్రంలో కొత్తగా 3.70 కోట్ల తాటి, ఈత చెట్లను నాటించారన్నారు. హైదరాబాద్‌లో తిరిగి కల్లు కాంపౌడ్లను పునరుద్ధరించారన్నారు. నాటి పాలకులు గౌడలను ఓటర్లుగానే పరిగణించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం గౌడలకు ప్రాధాన్యమిచ్చిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నీరా పానియాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. వారి వెంట కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, డీసీసీబీ చైర్మన్‌ కురాకుల నాగభూషణం, నగర మేయర్‌ పాపాలాల్‌, కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ మరికంటి ధనలక్ష్మి, రాష్ట్ర ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ అంజన్‌రావు, ఎక్సైజ్‌శాఖ ఈఎస్‌ సోమిరెడ్డి, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీప్రసాద్‌, రూరల్‌ ఎంపీపీ బెల్లం ఉమ, కార్పొరేటర్లు సక్కుబాయి, పగడాల నాగరాజు, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు అమరగాని వెంకటేశ్వర్లు, నాయకులు గుడిద శ్రీనివాస్‌, బిచ్చాల తిరుమలరావు, కోసూరి రమేశ్‌, మార్కం లింగయ్య, సింగం సత్తయ్య, కలర్‌ సత్తన్న, కట్టెకోల వెంకన్న, సంపెట ఉపేందర్‌, బోడపట్ల వెంకన్న, నెహ్రుగౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పార్టీ రూరల్‌ మండల అధ్యక్షుడు బెల్లం వేణు  పాల్గొన్నారు.

బీసీలకు ప్రాధాన్యం..

నగరంలోని ప్రధాన రహదారికి పక్కనే 2000 చదరపు గజాల్లో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మంచ తలపెట్టిన బీసీ భవన నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మంత్రి అజయ్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. బీసీ భవన్‌ ఆత్మగౌరవ వేదికగా నిలుస్తుందన్నారు. ఈ భవనంలో ప్రతి సంఘానికి ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రానున్న ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు.

తీగల వంతెన, హరిత హోటల్‌కు శంకుస్థాపన 

నగరంలోని బైపాస్‌రోడ్డు పక్కన రూ. 8 కోట్లతో నిర్మించే హరిత హోటల్‌, లకారం ట్యాంక్‌బండ్‌పై రూ. 8 కోట్లతో ఏర్పాటు చేయనున్న తీగల వంతెన, రూ.2 కోట్లతో చేపట్టనున్న మ్యూజికల్‌ ఫౌంటేన్‌కు మంత్రులు అజయ్‌కుమార్‌, శ్రీనివాస్‌గౌడ్‌ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, డీసీసీబీ చైర్మన్‌ కురాకుల నాగభూషణం, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, మేయర్‌ పాపాలాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, కార్పొరేటర్లు కమర్తపు మురళి, పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ, ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo