బుధవారం 20 జనవరి 2021
Khammam - Nov 24, 2020 , 00:17:22

తెల్లబంగారానికి రికార్డు స్థాయి ధర

తెల్లబంగారానికి రికార్డు స్థాయి ధర

  • ఖమ్మం ఏఎంసీలో క్వింటాల్‌ ఒక్కంటికి గరిష్ఠ ధర రూ. 5,500

ఖమ్మం వ్యవసాయం : గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారానికి రికార్డు స్థాయి ధర పలికింది. దీంతో మార్కెట్‌ యార్డుకు పంటను తీసుకువచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటాల్‌కు ఒక్కంటికి ఖరీదుదారులు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో గరిష్ఠంగా రూ 5,500 కు బిడ్‌ చేయడం విశేషం. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన భారత పత్తి సంస్థ కొనుగోలు కేంద్రాలకు రైతులు పంటను తీసుకువస్తున్నారు. ఇతర రాష్టల నుంచి భారీగా ఆర్డర్లు రావడంతో స్థానిక వ్యాపారులు యార్డుకు వచ్చిన పంటను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. దీంతో కేవలం ఐదురోజుల వ్యవధిలోనే పంటకు క్వింటాల్‌కు ఒక్కంటికి రూ. 500 పైగానే పెరిగింది. ప్రస్తుతం సీసీఐ కేంద్రాల్లో పంటకు గరిష్ఠ ధర రూ. 5,725 పలుకుతుంది. నేటి వరకు జిల్లా వ్యాప్తంగా భారత పత్తిసంస్థ 1,13, 687 క్వింటాల పత్తిని కొనుగోలు చేయగా, ప్రైవేట్‌ వ్యాపారులు మరో 89,930 క్వింటాల పత్తిని కొనుగోలు చేశారు. జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తిపంటకు మంచి డిమాండ్‌ పలుకుతుండటంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రానున్న రోజుల్లో పత్తిపంటకు క్వింటాల్‌కు ఒక్కంటికి రూ. 6వేల వరకు ధర పలికే అవకాశం ఉందనే వార్తలు వ్యాపారవర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.


logo