మంగళవారం 20 అక్టోబర్ 2020
Khammam - Sep 23, 2020 , 03:19:56

స్మార్ట్‌ ఎడ్యుకేషన్‌..!

స్మార్ట్‌ ఎడ్యుకేషన్‌..!

ఆన్‌లైన్‌ విద్యకు  మంచి స్పందన

టీ శాట్‌, దూరదర్శన్‌ ద్వారా బోధన

ఉమ్మడి జిల్లాలో పాఠాలు వింటున్న విద్యార్థులు

నిరంతరం  పర్యవేక్షిస్తున్న డీఈవోలు

చిన్నారుల సందేహాలను నివృత్తి చేస్తున్న ఉపాధ్యాయులు

బడి గంటలు లేవు.. నల్ల బోర్డు లేదు.. చాక్‌పీసులు లేవు.. కానీ విద్యార్థులు మాత్రం ‘స్మార్ట్‌'గా చదువుకుంటున్నారు.. తెలంగాణ ప్రభుత్వం ఈ నెలలో విద్యాసంవత్సరం ప్రారంభించగా చిన్నారులు బడికి రాకుండానే పాఠాలు నేర్చుకుంటున్నారు.. టీశాట్‌, దూరదర్శన్‌, యూట్యూబ్‌ ద్వారా బోధనలు వింటున్నారు.. ఉమ్మడి జిల్లాలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశపెట్టిన ‘ఆన్‌లైన్‌' విద్యకు క్షేత్రస్థాయిలో మంచి స్పందన లభిస్తున్నది.. డీఈవోల నేతృత్వంలో ఉపాధ్యాయులు ప్రతిరోజూ విద్యార్థులను సమన్వయం చేస్తున్నారు. బోధనలో అర్థం కాని విషయాలను విశదీకరిస్తున్నారు. సందేహాలను నివృత్తి చేస్తున్నారు.. మొత్తానికి ‘డిజిటల్‌' విద్యలో ఉభయ జిల్లాలు దూసుకెళ్తున్నాయి. 

కొవిడ్‌ 19 కారణంగా సాధారణ విద్యకు దూరమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టీవీల ద్వారా పాఠాలు  ఈనెల 1వ తేదీ నుంచి మొదలయ్యాయి. ఈ ఆన్‌లైన్‌ తరగతుల్లో ఉమ్మడి జిల్లా ముందంజలో నిలిచింది. విద్యాశాఖ ఎప్పటికప్పుడూ ఉపాధ్యాయులతో సమీక్షిస్తూ విద్యార్థుల సమగ్ర నివేదిక తెప్పించుకుంది. ‘పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఎంతమందికి టీవీలు ఉన్నాయి. మొబైల్‌ ఫోన్లు ఎంత మందికిఉన్నాయి. కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌లు ఎంత మంది ఉన్నాయి.  అసలు డిజిటల్‌ పరికరాలు అందుబాటులో లేని విద్యార్థులు ఎంత మంది ఉన్నారు’. అనే విషయాలపై ఒక సమగ్ర నివేదిక తయారు చేసుకుంది ఈ నివేదిక ప్రకారం భద్రాద్రి జిల్లాలో 69,443 మంది విద్యార్థుల్లో 9,989 మందికి ఎటువంటి డిజిటల్‌ పరికరాలు అందుబాటులో లేవని తేలింది. ఈ విద్యార్థులను టీవీ లేదా మొబైల్‌ ఫోన్‌ లేదా కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ ఉన్న తోటి విద్యార్థులతో జతచేయడం, మిగిలిన వారిని గ్రామ పంచాయతీలు లేదా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న టీవీల ద్వారా పాఠాలను వినేలా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ ఇంకా 418 మంది విద్యార్థులకు ఎటువంటి డిజిటల్‌ పరికరాలు అందుబాటులో లేవు. వీరికి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ (ఎస్‌సీఈఆర్‌) తయారు చేసిన వర్క్‌షీట్లను అందజేయడం ద్వారా పాఠాలను నేర్చుకునేలా ఏర్పాట్లు చేశారు. 

ముందస్తు ప్రణాళిక.. విద్యార్థుల మ్యాపింగ్‌

ముందస్తు ప్రణాళికతో ఆన్‌లైన్‌ తరగతుల అమలుకు విద్యాశాఖ పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. ముందస్తుగా ఎంఈవోలు, ఉపాధ్యాయులతో సమీక్ష చేసి డిజిటల్‌ పరికరాలు లేని విద్యార్థుల సంఖ్యను గుర్తించింది. ఆ తర్వాత అందుబాటులో పరికరాలు ఉన్న విద్యార్థులను ఏమీ లేని విద్యార్థులను జత కలిపి బోధన అందించేలా  చేసింది. ఇంకా కొంతమంది పిల్లలను గ్రామ పంచాయతీ లేదా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న టీవీలకు అనుసంధానం చేసింది. అయినప్పటికీ జిల్లాలో ఇంకా 418 మంది పిల్లలకు ఎటువంటి డిజిటల్‌ పరికరాలు అందుబాటులో లేవు. వీరికి వర్క్‌షీట్లను అందించడం లాంటి కార్యక్రమాలను చేపట్టింది. 

 జిల్లా మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు

 క్షేత్రస్థాయిలో కలిగే సందేహాలకు సమాధానాలు ఇవ్వడం మొదలైన కార్యక్రమాలను నిర్వహించడానికి జిల్లా మానిటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేశారు.  కాగిత రహిత పర్యవేక్షణలో భాగంగా మండలాల నుంచి నివేదికలను తెప్పించుకునేందుకు గూగూల్‌ ఫారాలు, గూగూల్‌ షీట్స్‌ లాంటి వాటిని వినియోగిస్తున్నారు. నిరంతర సమావేశాల కోసం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా డీఈవో సమీక్షిస్తున్నారు. 

 ప్రత్యేక మొబైల్‌ అప్లికేషన్‌

    పర్యవేక్షకులు వారి పర్యవేక్షణ రిపోర్టులు పంపడానికి PADLET అనే మొబైల్‌ అప్లికేషన్‌ వినియోగించడం, దీని ద్వారా పర్యవేక్షకులు పరిశీలించిన విషయాలను రిపోర్టులు, ఫొటోలు, వీడియోల రూపంలో అప్‌లోడ్‌ చేస్తే వాటిని జిల్లాస్థాయిలో నేరుగా చూడవచ్చు. అంతేకాక వారితో నేరుగా మాట్లాడవచ్చు. ఎటువంటి సందేహాన్నైనా సాధ్యమైనంత త్వరగా తీర్చేందుకు నిరంతరం రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడటం. అదే విధంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం, డిష్‌ టీవీలలో ఎయిర్‌టెల్‌ తప్ప మిగిలిన డిష్‌లలో టీశాట్‌ ప్రసారాలు రాకపోవడం, మారుమూల గిరిజన గ్రామాల్లో ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం, ఉపాధ్యాయులలో నెలకొన్న కొవిడ్‌ భయాందోళనలు తదితర సమస్యలను అధిగమిస్తున్నారు. 

మారుమూల  గ్రామాల్లో   పర్యటన

   మారుమూల గ్రామాల్లో ఎలాంటి రహదారి సౌకర్యం లేని కోయగుంపులు, గిరిజన గూడేల్లో అధికారులు పర్యటించి విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. ఇల్లెందు, గుండాల, జూలూరుపాడు మండలం బెండాలపాడు శివారు గిరిజన గ్రామాల్లో అధికారులు సందర్శించి ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్న తీరును పరిశీలించి వారికి తగు సూచనలు, సలహాలు చేస్తున్నారు. విద్యుత్‌శాఖ ఎస్‌ఈతో మాట్లాడి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని కోరాం. ఇప్పటికే జిల్లాలోని కేబుల్‌ ఆపరేటర్లకు టీశాట్‌, దూరదర్శన్‌ ఛానెళ్లు ప్రసారం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. డిజిటల్‌ పరికరాలు లేని వారికి వర్క్‌షీట్లను అందజేస్తున్నాం. దీనివల్ల రోజుకు సగటున 82 శాతం మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలను వింటున్నారు. ఆన్‌లైన్‌ తరగతుల్లో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో ఉండటం సంతోషంగా ఉంది. 

 - సోమశేఖరశర్మ, భద్రాద్రి  జిల్లా విద్యాశాఖాధికారి

ప్రతి విద్యార్థి ఆన్‌లైన్‌ పాఠాలు వినేలా.. 

 జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో చదువుతున్న ప్రతి విద్యార్థి ఆన్‌లైన్‌ పాఠాలు వినేలా శ్రద్ధ్ద తీసుకున్నాం. ఉపాధ్యాయుల నుంచి ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, ప్రత్యేక మానిటరింగ్‌ బృందాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నాం. వాట్సాప్‌ గ్రూప్‌ల ద్వారా సందేహాలను నివృత్తి చేయడంతో పాటు మారుమూల గ్రామాల్లోని విద్యార్థుల ఇండ్లకు నాతో పాటు ఉపాధ్యాయులు వెళ్లేలా సూచనలు చేస్తున్నాం.

-పోన్నూరు మదన్‌మోహన్‌, ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారిlogo