గురువారం 02 జూలై 2020
Khammam - Apr 13, 2020 , 02:30:57

కష్టానికి తగిన గుర్తింపు

కష్టానికి తగిన గుర్తింపు

  • వైద్యపరమైన సేవల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు
  • సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం
  • పారితోషికం ప్రకటనపై హర్షాతిరేకాలు

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: కరోనా ఒకవైపు మానవాళిని భయకంపితులను చేస్తున్నది.. దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నది.. వైద్యారోగ్యశాఖ కరోనా కేసులను కట్టడి చేయడంలో ముందు వరసలో ఉంది. వైద్యులు ప్రాణాలకు తెగించి బాధితులు, అనుమానితులకు చికిత్స అందిస్తున్నారు.. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు సర్వే చేపట్టడంలో, అనుమానితులను గుర్తించడంలో సాయపడుతున్నారు. ఆపదకాలంలో బాధితులకు భరోసానిస్తున్నారు. అవసరమైతే కాలినడకన ఇంటింటికీ వెళ్లి సేవలు అందిస్తున్నారు. వారికి పడుతున్న కష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల పారితోషికం ప్రకటించింది. వారి సేవలకు అభినందనలు తెలిపింది.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి గుర్తింపు..

పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో స్థానికుల సాయంతో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు కరోనా అనుమానితులను గుర్తిస్తున్నారు. ఇతర ఢిల్లీ, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో దూరప్రాంతాల నుంచి వచ్చిన వారు సరైన సమాచారం ఇవ్వడం లేదు. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులకు సమాచారం అందిస్తున్నారు. దీంతో సమస్యకు పరిష్కారం దొరుకుతున్నది. జిల్లాలోని అశ్వారావుపేట, భద్రాచలం, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాలతో పాటు జిల్లాకేంద్రంలోని కొత్తగూడెం అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, సఫాయి బస్తీ హెల్త్‌ సెంటర్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌ హెల్త్‌ సెంటర్‌ పరిధిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు, ఆశాలు కరోనాపై నిరంతరం వైద్యసేవలు అందిస్తున్నారు. ఒకవైపు గర్భిణులు, బాలింతలకు సేవలు అందిస్తూనే కరోనా విధులకు హాజరవుతున్నారు. వారి సేవలను ప్రభుత్వం గుర్తించి అదనంగా పదిశాతం పారితోషికాన్ని ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.


logo