మంగళవారం 31 మార్చి 2020
Khammam - Jan 17, 2020 , 00:02:20

ఇంటింటా సంక్రాంతి..

ఇంటింటా సంక్రాంతి..
  • -అంబరాన్నంటిన పండుగ సంబురం
  • -ఆనందోత్సాహాల నడుమ భోగి, సంక్రాంతి, కనుమ
  • -పతంగులు ఎగురవేసిన చిన్నారులు

సంక్రాంతి ఇంటింటా ఆనందాలు నింపింది.. సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా జిల్లావాసులు పండుగను ఘనంగా జరుపుకున్నారు.. బంధు మిత్రులతో ఆనందంగా గడిపారు.. భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలు పల్లెలకు కొత్త కళను తీసుకువచ్చాయి.. చిన్నారులు పతంగులు ఎగుర వేస్తూ సందడి చేశారు.. ముఖ్యమైన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి..    -నెట్‌వర్క్‌


ఖమ్మం కల్చరల్‌, జనవరి 16: ఊరంతా సంక్రాంతి సంబురంతో ఆనందోత్సాహం నింపింది. ఆనందం, ఆధ్యాత్మికం,  శాస్త్రీయతల మేళవింపుగా సంక్రాంతి పండుగ నూతన కాంతిని తెచ్చిపెట్టింది. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు బుధవారం మకర రాశిలోకి ప్రవేశించిడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. సూర్యుడు మకర రాశిలోకి సంక్రమణమే సంక్రాంతి పండుగగా ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. సంక్రాంతి పండుగకు ముందు వచ్చే భోగి పండుగను మంగళవారం వైభవంగా నిర్వహించుకోగా, బుధవారం సంక్రాంతి, గురువారం  కనుమ పండుగలను సంతోషాలతో జరుపుకున్నారు. ఈ మేరకు జిల్లాలోని పలు శైవ, వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెనుగింటి ముంగిళ్లలో రంగురంగుల ముత్యాల ముగ్గులు.. ఆకాశంలో ఎగిరిన గాలిపతంగులు.. మైమరిపించిన హరిదాసు కీర్తనలు.. తెనుగింటి సంప్రదాయానికి ప్రతీకగా సంప్రదాయ వస్త్రధారణలు.. వండిన కొత్త చక్కెర పొంగలి, పరమాన్నం.. ప్రాచీన కళకు అద్దంపట్టే గంగిరెద్దుల విన్యాసాలు.. నోరూరించే చకినాలు, బొబ్బట్లు, అరిసెలు, కారప్పూస, పులిహోరల ఘుమఘమలు.. బంధుమిత్రుల కోలాహలం.. ఆలయాల్లో విశేష పూజలు, అర్చనలు... .వెరసి జిల్లా అంతటా సంక్రాంతి సందడితో ఆనందం వెల్లివిరిసింది.

జిల్లాలోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, నేలకొండపల్లి, కూసుమంచి, వైరా, ముదిగొండ కేంద్రాలతోపాటు వాడవాడలా పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. భక్తులు ఆలయాలకు తరలివెళ్లి తమతమ ఇష్టదైవాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ  కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులతో పండుగ ఆనందాన్ని పంచుకునారు. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా   వైష్ణవాలయాల్లో గోదా రంగనాథుల కల్యాణం కమనీయంగా జరిగింది. బ్రహ్మీముహార్తాన పవిత్ర స్నానాలు ఆచరించి, ఇండ్ల వాకిట్లలో సూర్య రథంతో రంగురంగుల రంగవల్లులను వేసి, ఇండ్లను మామిడి తోరణాలతో అలంకరించారు. తమ తమ ఇండ్లలో బొమ్మల కొలువులు నిర్వహించి, ముత్తయిదువులు పేరంటాలలో వాయనాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు. దేవతల పగటి కాలంగా చెప్పుకునే ఈఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య భగవానుడిని ఆరాధించి, లోకబాంధవుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. వ్యవసాయ ప్రధానమైన కనుమ పండుగ నాడు రైతులు వ్యవసాయ పనిముట్లు, పశువులకు పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు చేశారు.

పాడిపంటలను తెచ్చిపెట్టే పశువులను రైతులు నూతన వస్ర్తాలు, పసుపు, కుంకుమలతో అలంకరిచి పూజలు చేశారు. సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చిన్నాపెద్దా అందరూ పతంగుల ఎగురవేతలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని స్తంభాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో గోదాదేవి కల్యాణంతో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.. నెల రోజుల పాటు ఆండాళ్‌ తల్లి తిరుప్పావై వ్రతాన్ని నిష్టతో ఆచరించి రంగనాథుడిని పరిణయమాడే కమనీయ ఘట్టాన్ని ఆలయంలో ప్రధాన అర్చకుడు నరహరి నర్సింహాచార్యుల బృందం అత్యంత శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు, భక్త బృందం ఆధ్వర్యంలో కనుల పండువగా నిర్వహించిన గోదా రంగానాథుల కల్యాణం భక్తులను తరింపజేసింది. ఈ సందర్భంగా వాడవాడలా పలు సంస్థలు నిర్వహించిన ముగ్గుల పోటీలతో దారులన్నీ రంగవల్లులతో బారులు తీరి సప్తవర్ణశోభితమయ్యాయి. నగరంలోని శ్రీనివాసనగర్‌లోని శ్రీశాస్తా అయ్యప్ప స్వామి దేవాలయంలో నంబూద్రి అయ్యగారు మకర జ్యోతిని శాస్ర్తోక్తంగా వెలిగించడంతో భక్తులు దర్శనం చేసుకొని పునీతులయ్యారు.
logo
>>>>>>