
ఉమ్మడి జిల్లాలో భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి పర్వదినం
జ్వాలాతోరణం, రుద్రాభిషేకం, బిల్వదళార్చనలతో పులకింత
ఉపవాసం, దీపారాధన, శివార్చనలతో తరించిన భక్తులు
ఖమ్మం కల్చరల్/ కొత్తగూడెం కల్చరల్, నవంబర్ 19: కార్తీక పౌర్ణమి వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆలయాలన్నీ శోభాయమానంగా మారాయి. కోటి కాంతుల వెలుగులు విరజిమ్మాయి. పున్నమి వెన్నెలకు వేనవేల దీపాల దొంతరలు తోడయ్యాయి. భక్తుల ఆధ్యాత్మిక, భక్తి సౌరభాలు వెరసి కార్తీక పౌర్ణమి పర్వాన్ని కాంతిమయం చేశాయి. బ్రహ్మీముహార్తాన భక్తులు అభ్యంగన నదీ పవిత్ర స్నానాలు ఆచరించి సమీప శైవ, వైష్ణవ ఆలయాలకు వెళ్లి స్వామిని దర్శించుకొని పూజలు, అర్చనలు, అభిషేకాలు, దీపారాధనలు చేసి పునీతులయ్యారు. కూసుమంచి, తీర్థాల, పెనుబల్లి, కారేపల్లి, మధిర, ఖమ్మంలలోని శివాలయాలు ‘ఓం నమఃశ్శివాయ’ పంచాక్షరి మంత్రంతో మార్మోగాయి. ఖమ్మం గుంటు మల్లేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామునుంచే భక్తులు బారులు తీరారు. స్వామి దర్శనం చేసుకుని, అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో ప్రమిదలు, అరటి దొప్పలు, ఉసిరి కాయల్లో దీపాలు వెలిగించారు. సాయంత్రం వేళల్లో శివాలయాల్లో దేదీప్యమానంగా ప్రజ్వరిల్లిన జ్వాలాతోరణాల నుంచి దాటుతూ భక్తులు తరించారు. సంవత్సరం మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం దక్కేవిధంగా 365 వత్తులను వెలిగించారు. ప్రాచీన దివ్యక్షేత్రం శ్రీస్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు కిటకిటలాడారు.
ఆలయాల్లో నేత్రపర్వం…
కొత్తగూడెంలోని శ్రీ విజయవిఘ్నేశ్వర స్వామి ఆలయంలో జ్యోతిర్లింగార్చన కార్యక్రమాన్ని గురువారం రాత్రి నిర్వహించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. కనకదుర్గ అమ్మవారు, దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంతోపాటు ఉసిరి చెట్టు వద్ద, నాగేంద్రస్వామి విగ్రహం వద్ద, నవగ్రహాల వద్ద ప్రత్యేకంగా భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. చంటిపిల్లల తల్లులు సైతం కార్తీక దీపాలు వెలిగించేందుకు తెల్లవారు జామునే ఆలయాలకు చేరుకున్నారు. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.