
హైదరాబాద్‌లో మంత్రులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వినతులు
సత్తుపల్లి, నవంబర్ 19: సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్వహించనున్న వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహమూద్ అలీలను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. మంత్రి కేటీఆర్ హామీ నిధులు రూ.30 కోట్లు విడుదల చేయాలని కోరారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న 35 ఎకరాల భూమిని నిరుపేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టర్లకు రూ.3.50 కోట్ల బిల్లులు నిలిచిపోయినందున వాటికి సత్వరమే క్లియరెన్స్ ఇప్పించాలని విన్నవించారు. డిప్యూటీ సీఎం మహమూద్‌అలీని కలిసి వేంసూరు రోడ్డులో ఉన్న షాదీఖానా శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో నూతన షాదీఖానా నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కౌన్సిలర్ చాంద్‌పాషా పాల్గొన్నారు.