
అమరుల స్మరణతో పీర్ల ఊరేగింపు
నేడు మొహర్రం పండుగ..
ఖమ్మం కల్చరల్/ కొత్తగూడెం కల్చరల్, ఆగస్టు 19: ముస్లిం వీరుల స్మారకార్థం శోకతప్త హృదయాలతో జరుపుకునే పీర్ల పండుగ మొహర్రం. ఆత్మ త్యాగాలను గుర్తుకు తెచ్చేదే ఈ పండుగ. మొహరం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రజాస్వామ్యం , మానవ హక్కుల కోసం పద్నాలుగు శతాబ్దాల క్రితం జరిగిన చారిత్రక పోరాటం మొహర్రం. ‘పీర్’ అంటే మహాత్ముడు, ధర్మనిర్దేశకుడు అని అర్థం. ధర్మయుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ప్రతీకగా పీర్లు అనే హస్తాకృతులను తయారు చేసి వాటిని అలంకరించి ఊరేగించి పూజిస్తారు. ఈ రోజున ఎంతో ఉద్వేగంతో అమరవీరులను స్మరిస్తారు. ఈ పది రోజులూ విషాద దినాలే.
మొహర్రం పండుగ అనగానే గుర్తుకొచ్చేది ఇమామే హుస్సేన్, ఇమామే హసన్. రక్తపుటేరులతో ఎరుపెక్కిన ‘కర్బలా’ మైదానాన్ని, ఇమామే హుస్సేన్, హసన్‌లు ఎదుర్కొన్న కష్టాలను, త్యాగాలను గుర్తు చేసుకుంటూ పది రోజులపాటు నిరసన దినాలుగా పాటిస్తారు. ఇమామే హుస్సేన్ అమరుడై 1400 ఏళ్లు దాటింది. అందుకు నిరసనగా పది రోజులు నిరసన దినాలు పాటిస్తారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ‘షహాదత్’ను జరుపుకొని మొహర్రం పండుగను జరుపుకోనున్నారు. ఈ మొహర్రం మాసంతోనే ముస్లింల నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజులుగా జిల్లా అంతటా పీర్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పదో రోజు శుక్రవారంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి.
త్యాగానికి ప్రతీక హుస్సేన్..హసన్..
ఖలీఫా హజ్రత్ అలీ తనయులు ఇమామే హుస్సేన్, ఇమామ్ హసన్. హజ్రత్ అలీ తరువాత ప్రజలు ఇమామ్ హసన్‌ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు. అప్పుడు సిరియా గవర్నర్ మావియా. అతడికి అధికార దాహంతో రాజ్యాధికార కాంక్ష పెరిగింది. దీంతో యుద్ధం ప్రకటించి ఇమామ్ హసన్‌ను గద్దె దించాలనుకున్నాడు. యుద్ధంలో పాల్గొంటే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతారని బాధపడ్డారు. ప్రజలు తనకు కట్టబెట్టిన పదివిని.. రణ నివారణ కోసం హసన్ త్యజించారు. మావియా కుట్ర ఫలించింది. కొద్ది వ్యవధిలోనే హసన్ విష ప్రయోగానికి గురై చనిపోయారు. నిరంకుశంగా మావియా తన కుమారుడు యజీద్‌ను రాజ్యాధికారిగా నియమించాడు. చర్చల కోసం ఇమామ్ హుస్సేన్ రాజధాని కుఫాకు బయలుదేరాడు. యజీద్‌కు విషయం తెలిసింది. పాషాణ హృదయుడైన అతడు.. ఇమామ్ హుస్సేన్ పరివారాన్ని కర్బల అనే చోట అడ్డగించాడు. తనను రాజుగా అంగీకరించమని యుద్ధానికి కాలు దువ్వాడు.. పది రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ హుస్సేన్ పరివారం వీరోచితంగా పోరాడి అశువులు బాసింది. హుస్సేన్ ఒక్కరే మిగిలాడు. పదో రోజు హుస్సేన్ ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు దొంగచాటుగా పొడిచి హత్యచేశారు. ఆ విధంగా పదో రోజు ‘షహాదత్’ను సంతాప దినంగా పాటించాల్సిందిగా హుస్సేన్ అనుచర వర్గం ప్రకటించింది. అమరవీరులు ఇమామే హుస్సేన్, ఇమామే హసన్‌లు పడిన కష్టాలను, త్యాగాలను స్మరిస్తూ పది రోజుల పాటు విషాద దినాలను గడుపుతారు. ముస్లిం సోదరులు వారిని స్మరిస్తూ పీర్ల ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు పదో రోజు ముగియడంతో ఆ రోజు మొహర్రం పండుగను స్మరణగా జరుపుకుంటారు.
నేడు ఉమ్మడి జిల్లాలో పీర్ల ఊరేగింపు ..
అమరవీరులను స్మరిస్తూ పీర్లను ఊరేగించే మొహర్రం పండుగను శుక్రవారం జిల్లా అంతటా నిర్వహించనున్నారు. పీర్ల చావిళ్లలోని పీర్లను వీధుల్లో ఊరేగించి ఇమామే హుస్సేన్, హసన్‌ను స్మరిస్తారు. పలు చావిళ్ల వద్ద పీర్లను ప్రతిష్ఠించి దాని ఎదుట అగ్నిగుండాల చుట్టూ తిరుగుతూ మృతవీరులను స్మరించుకుంటారు. ఖమ్మంనగరంలోని తుమ్మలగడ్డ , శుక్రవారిపేట, నిజాంపేట, రిక్కాబజార్, మమత హాస్పిటల్ రోడ్డు, పుట్టకోట, శివాలయం సమీపం, మున్సిపల్ కార్యాలయం వద్ద, కస్బాబజార్, రేవతి సెంటర్ తదితర సెంటర్లలో పీర్లను ప్రతిష్ఠించి అక్కడి నుంచి నగర వీధుల్లో ఊరేగింస్తారు. గ్రామాల్లోనూ ఇదే విధంగా జరుపుకుంటారు.