
రఘునాథపాలెం, అక్టోబర్ 18;శ్రీనివాస్ ఖమ్మం నగరంలో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఏటేటా అద్దె పెంచుతుండడంతో అతడి సంపాదన ఇంటి కిరాయికే సరిపోతున్నది. పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. మిత్రుడి సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ‘డబుల్ బెడ్రూం’ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. లాటరీలో తన పేరు వచ్చి ఇల్లు సొంతంకావడంతో తెగ సంబురపడిపోతున్నాడు. ఇక నుంచి అద్దెంటి కష్టాలు ఉండవనీ, కిరాయిల భారం దూరం కానున్నదని మురిసిపోతున్నాడు. సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు రుణపడి ఉంటానంటున్నాడు.
నిరుపేదల సొంతింటి కల సాకారమైంది.. గూడు గోస తీరింది.. అద్దెంటి కష్టాలు ఇక శాశ్వతంగా దూరమయ్యాయి. ఖమ్మం నియోజకవర్గంలో నిరుపేదలకు గూడు నిర్మించాలన్న సంకల్పంతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని గేటెడ్ కమ్యూనిటీని తలపించేలా టేకులపల్లిలో ‘డబుల్ బెడ్ రూం ఇండ్ల’ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తొలి దఫాలో 1,004 ఇళ్లు పూర్తి చేసి దసరా పర్వదినాన పండుగ వాతావరణంలో లబ్ధిదారుల చేత గృహప్రవేశాలు చేయించారు. నయా పైసా ఖర్చు లేకుండా తెలంగాణ సర్కారు ఇండ్లను నిర్మించి ఇవ్వడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం నగరం టేకులపల్లిలోని డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం నిరుపేదలకు గూడు అందించింది. 2017లో మూడెకరాల్లో 400 ఇండ్లతో మొదలైన నిర్మాణం.. పూర్తయ్యేనాటికి 11 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 1250 ఇండ్లకు చేరింది. ఖమ్మం నియోజకవర్గంలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న సంకల్పంతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని గేటెడ్ కమ్యూనిటీని తలపించే విధంగా ఖమ్మం టేకులపల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తొలి దఫాగా 1004 ఇళ్లు పూర్తి చేసి దసరా పర్వదినాన పండుగ వాతావరణంలో లబ్ధిదారుల చేత గృహప్రవేశాలు సంబురంగా పూర్తిచేశారు. ఆ సమయంలో లబ్ధిదారుల సంతోషాలకు అవధుల్లేవు. గేటెడ్ కమ్యూనిటీ ఇండ్లను ఖమ్మంలో తెలంగాణ సర్కారు నయా పైసా ఖర్చు లేకుండా నిర్మించి ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేశారు.
ఖమ్మం నియోజకవర్గానికి మొదటి విడతగా మంజూరైన 400 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించాలనే ఉద్దేశంతో 2017లో టేకులపల్లిలోని సెరీకల్చర్‌కు సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని సేకరించారు. నాడు ఆర్అండ్బీ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత మరో వెయ్యి ఇండ్లు మంజూరు కావడంతో వాటిని కూడా ఇక్కడే నిర్మించేలా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మరికొంత స్థలాన్ని సేకరించి మొత్తం 1250 ఇండ్లు నిర్మించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇద్దరు కలెక్టర్ల పర్యవేక్షణలో..
టేకులపల్లిలో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఇద్దరు కలెక్టర్ల పర్యవేక్షణలో శరవేగంగా సాగింది. 2018 నుంచి అప్పటి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పలు దఫాలుగా ఈ డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రాంగణాన్ని నిత్యం సందర్శించి అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇండ్ల సముదాయాల్లో లబ్ధిదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఆ తరువాత ఆయన స్థానంలో వచ్చిన ప్రస్తుత కలెక్టర్ వీపీ గౌతమ్ సైతం అనతి కాలంలోనే అనేకసార్లు ఈ డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రాంగణాన్ని సందర్శించి పనుల వేగాన్ని పెంచారు. ఫలితంగా అనుకున్న సమయానికి దసరా రోజు లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు.
40 సార్లు సందర్శించిన మంత్రి..
ఈ ఇండ్ల నిర్మాణం మొదలైన నాటి నుంచి అజయ్‌కుమార్ 40 సార్లు సందర్శించి అధికారులకు ఆదేశాలు, సూచనలు చేశారు. ఈ విషయాన్ని మంత్రి పువ్వాడ దసరా రోజు జరిగిన గృహప్రవేశాల కార్యక్రమంలో స్వయంగా వెల్లడించారు. గృహప్రవేశాలు చేసిన నిరుపేదల మోముల్లో ఆనందాన్ని చూసిన రోజును జీవితంలో తాను ఏనాటికీ మర్చిపోలేనని మంత్రి చెప్పిన మాటలు విన్న నిరుపేద లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల్లో నివాసం ఉండే ప్రజలు ఏ ఒక్క వస్తువు కోసమూ బయటకు వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అని వస్తువులతో కూడిన సూపర్ మార్కెట్, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక పాఠశాల, కూరగాయల మార్కెట్ వంటివన్నీ అందుబాటులో ఉంచారు.
గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తోంది..
టేకులపల్లిలో వెయ్యి మంది నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయం గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తోంది. జిమ్, అంగన్వాడీ కేంద్రం, సూపర్‌మార్కెట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆటస్థలం తదితర సౌకర్యాలు కల్పించారు. ఇన్ని సదుపాయాలతో మాకు ఇంటిని కేటాయించి ఇవ్వడం సంతోషంగా ఉంది. మాకు ఇల్లు వస్తదని, సొంతింట్లో ఉంటామని కలలో కూడా ఊహించలేదు.
-షేక్ జహెరాబానుమున్నీ, బీకే బజార్, లబ్ధిదారురాలు
ఇల్లు వస్తది అనుకోలేదు..
రెక్కాడితే కానీ డొక్కాడని మాకు డబుల్ బెడ్ రూం ఇల్లు రావడాన్ని నమ్మలేకపోతున్నాం. సొంతింట్లో ఉంటామని జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. కూలి పనులు చేసుకునే మేము.. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇంట్లో నివసిస్తున్నాం. మంత్రిగారు గృహప్రవేశాలు చేయించారు. ప్రభుత్వం సాయాన్ని మర్చిపోం.
-నాగిశెట్టి జయశంకర్, వికలాంగ లబ్ధిదారుడు