
సత్తుపల్లి, అక్టోబర్ 18: దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. అందుకే దేశం చూపంతా తెలంగాణ వైపే ఉందని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తూ తెలంగాణలోని ప్రతి కుటుంబానికీ కేసీఆర్ ఆరాధ్యుడయ్యారని కొనియాడారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ గ్రామ, పట్టణ, మండల కమిటీలు పూర్తయ్యాయని, ఈనెల 25న జరిగే టీఆర్ఎస్ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని అన్నారు. 2001లో ఒక్కడితో ప్రారంభమైన టీఆర్ఎస్ ప్రస్థానం నేటికీ నిరాటంకంగా సాగుతోందని, కొన్ని లక్షల మంది ఇందులో ఉన్నారని గుర్తుచేశారు. గడిచిన 70 ఏళ్లలో జరగని అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడేళ్లలోనే సాకారమైందని స్పష్టం చేశారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి ఎంపీ నామాను సన్మానించారు.
రైల్వేలైన్ నిర్మాణం వేగవంతం..
40 ఏళ్లుగా జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న భద్రాచలం – కొవ్వూరు రైల్వేలైన్ మంజూరై పనులు చురుకుగా సాగుతున్నాయని ఎంపీ నామా ఈ సందర్భంగా అన్నారు. 2012లో రైల్వేలైన్ నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేయించామని, అప్పటి నుంచి రైల్వే నిర్మాణం కోసం కేంద్ర రైల్వే శాఖ మంత్రికి 120 లేఖలను రాసి ఆ పనులు ముమ్మరంగా సాగేలా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. సత్తుపల్లికి రైల్వేలైన్ ఆవశ్యకతపై కేంద్రమంత్రికి విన్నవినంచినట్లు చెప్పారు. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, టీఆర్ఎస్ నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, రఫీ, మల్లూరు అంకమరాజు, దొడ్డా శంకర్రావు, యాగంటి శ్రీనివాసరావు, కొత్తూరు ఉమ, అమరవరపు కృష్ణారావు, వల్లభనేని పవన్, టోపీ శ్రీను, వనమా వాసు, వెల్ది జగన్మోహనరావు, వైద్యులు నర్సింహారావు, వల్లభనేని పవన్ పాల్గొన్నారు.