
గౌరవ వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ
జిల్లా వ్యాప్తంగా 3,600 మంది సిబ్బందికి లబ్ధి
ఖమ్మం వ్యవసాయం/రఘునాథపాలెం, ఆగస్టు 18 : ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అంగన్వాడీ, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు అండగా నిలిచారు. వారికి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంగన్వాడీల వేతనాన్ని రూ.7000 నుంచి రూ.10,500కు, మినీ అంగన్వాడీలు, ఆయాలకు రూ.4,500 నుంచి రూ.6 వేలకు పెంచుతూ బుధవారం స్త్రీ, శిశు సంక్షేమశాఖ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 3,600 మంది టీచర్లు, హెల్పర్లకు లబ్ధి చేకూరనున్నది.
తెలంగాణ సర్కార్ మరోమారు అంగన్వాడీ సిబ్బందికి తీపికబురు అందించింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మరోమారు అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లతోపాటు ఆయాల వేతనాలూ పెంచింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో అంగన్వాడీ సిబ్బందిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే స్వయంగా అంగన్వాడీ టీచర్లను పిలిపించుకొని వారి సాదక బాధకాలను అడిగి తెలుసుకున్నది. చిరుద్యోగుల సమస్యలను ఆలకించిన సీఎం కేసీఆర్ తక్షణం అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.7 వేల నుంచి రూ.10.500 పెంచారు. మినీ అంగన్వాడీలు, ఆయాలకు సంబంధించి నెలసరి వేతనం రూ.4,500 నుంచి రూ.6 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ కార్యకర్తలుగా పిలవబడే వారిని అంగన్వాడీ టీచర్లుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన సీఎం కేసీఆర్ అంగన్వాడీ సిబ్బంది వేతనాలు సైతం పెంచుతామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే బుధవారం స్త్రీ, శిశు సంక్షేమశాఖ రాష్ట్ర స్పెషల్ కార్యదర్శి డీ దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన వేతనాలు జూలై నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. పెరిగిన వేతనాలతో జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ పరిదిలో పని చేస్తున్న సుమారు 3,600 మంది టీచర్లు, హెల్పర్లకు లబ్ధి చేకూరనుంది.
కేసీఆర్కు కృతజ్ఞతలు..
గత ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలు పట్టించుకోలేదు. కేసీఆర్ మా మీద దయ చూపడం సంతోషంగా ఉంది. మా కష్టాన్ని సీఎం గుర్తించి జీతాన్ని రూ.13,650లు పెంచారు.
వేతనాల పెంపు సంతోషకరం..
వేతనాల పెంపు సంతోషంగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మా కష్టాన్ని గుర్తించి జీతాలను పెంచడం ఆనందంగా ఉంది. మేము అడక్కుండానే మూడో దఫా రూ.13,650కు పెంచుతూ ప్రకటన చేయడం హర్షనీయం. ఇక ముందు కూడా ప్రభుత్వ పథకాల్లో బాగస్వాములమై ప్రజలకు సేవలందిస్తాం..- ఆరెంపుల ఉష, టీచర్, పాండురంగాపురం
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
మరోమారు అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీలు, హెల్పర్లకు వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. ఉమ్మడి పాలనలో అంగన్వాడీ సిబ్బందిచే అనేక పనులు చేయించుకున్నా.. ఆశించిన మేర వేతనాలు పెంచలేదు. కనీస గుర్తింపు లేకుండా పోయింది. సీఎం కేసీఆర్ రెండు సార్లు వేతనాలు పెంచారు. కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వ ఆశయం నెరవేరేలా పని చేస్తాం.
-మేడా సునీత, టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం