
బొలెరో వాహనంపైకి డంపర్ దూసుకెళ్లడంతో ముగ్గురు కార్మికుల దుర్మరణం
మణుగూరు ఏరియా ఓసీ-2లో ప్రమాదం
సమగ్ర విచారణ చేపట్టాలని కార్మిక నేతల డిమాండ్
మణుగూరు రూరల్, ఆగస్టు 18: వారు కార్మికులు.. పనిలోనే విశ్రాంతిని వెతుక్కునే శ్రమజీవులు.. లోకానికి వెలుగులు పంచే యోధులు.. శ్రమనే నమ్ముకుని బతుకీడుస్తున్న వారిని మృత్యువు డంపర్ రూపంలో కబళించింది. వారి కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయేలా చేసింది.. భద్రాద్రి జిల్లా మణుగూరు ఏరియాలోని ఓసీ-2లో బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు, ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మృతిచెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. భాష్యా, సాగర్, వెంకన్న మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదంపై సూపర్వైజర్లు, కార్మిక సంఘాల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
మణుగూరు సింగరేణి ఏరియాలోని ఓసీ- 2లో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. బొలేరోని డంపర్ ఢీకొట్టిన ఘటనలో ఒక కాంట్రాక్టు కార్మికుడితో పాటు ఇద్దరు ఉద్యోగులు మృతిచెందారు. తెలిసిన వివరాల ప్రకారం.. ఓసీ-2 ఉపరితల గనిలో మధ్యాహ్న భోజన విరామం తర్వాత అజ్మీర భాష్యా (49) అనే ఎలక్ట్రీషియన్, పర్స సాగర్ (25) అనే జనరల్ మజ్దూర్, కాంట్రాక్ట్ డ్రైవర్ వేల్పుల వెంకన్న(32) క్వారీలోకి వెళ్లేందుకు బొలేరోలో బయల్దేరారు. ఈ క్రమంలో గొర్రెవాగు బ్లాక్‌లో 100 టన్నుల డంపర్(10556) ఆపరేట్ చేస్తున్న డ్రైవర్ గని నుంచి క్వారీలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న క్రమంలో బొలేరోపై డంపర్ దూసుకెళ్లింది. ప్రమాదంలో బొలేరోలోని భాష్యా, సాగర్, వెంకన్న తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న గని అధికారులు, ఏరియా ఉన్నతాధికారులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని వాహనంలో చిక్కుకుపోయిన వారిని వెలికితీశారు. అంబులెన్స్‌లో ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వారిని పరిశీలించి అప్పటికే ముగ్గురు మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న సూపర్వైజర్లు, కార్మిక సంఘాల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బొగ్గు ఉత్పత్తి పనులను నిలిపివేశారు. టీబీజీకేఎస్ నేతలు వూకంటి ప్రభాకర్‌రావు, సామాశ్రీనివాసరెడ్డి, అఖిలపక్ష నేతలు ప్రైవేట్ వెహికల్స్ సంఘం నాయకులు ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాద ఘటనపై అధికారులను వివరణ కోరడానికి యత్నించగా అందుబాటులోకి రాలేదు. ఏరియా ఆస్పత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటన జరుగకుండా ఏఎస్పీ శబరీశ్ నేతృత్వంలో సీఐ భాను ప్రకాశ్, ఎస్ఐ నరేశ్, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
కార్మిక సంఘాల ఆందోళన..
అధికారుల తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. డంపర్ ఆపరేటర్ షావల్ బ్రేక్ డౌన్ కావడంతో మరో షావల్ దగ్గరికి వెళ్లాలని ఆపరేటర్ని ఆదేశించినట్లు తెలుస్తున్నది. మైన్‌లోకి వెళ్లే ఆపరేటర్ అప్పటికప్పుడు డంపర్‌ను దారి మళ్లించడంతోనే ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, ఏఐటీయూసీ నేత రాంగోపాల్ డిమాండ్ చేశారు.
ముగ్గురి మృతుల కుటుంబాల్లో విషాదం..
మృతుడు భాష్యాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతని కుటుంబం మల్లారంలోని ఎంసీ క్వార్టర్లలో నివాసం ఉంటున్నది. ఆరేళ్ల క్రితం ఇల్లెందు నుంచి బదిలీపై వచ్చిన భాష్యా మణుగూరు ఓసీ-2లో సీనియర్ ఎలక్ట్రీషియన్‌గా సేవలందిస్తున్నాడు. మృతుల్లో మరో వ్యక్తి సాగర్ జనరల్ మజ్దూర్‌గా భాష్యా కింద పనిచేస్తున్నాడు. సాగర్ నాలుగేళ్ల క్రితం డిపెండెంట్ కోటాలో సింగరేణిలో ఉద్యోగం పొందాడు. మణుగూరులోని కేపీయూజీ మైన్ నుంచి డిప్యూటేషన్‌పై రెండు సంవత్సరాలుగా ఓసీ-2లో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నాడు. మృతుల్లో మూడో వ్యక్తి వేల్పుల వెంకన్న. ఈయన స్వగ్రామం ఎగ్గడిగూడెం. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకన్న నిర్వాసితుల కోటాలో సింగరేణిలో బొలేరో నడుపుతున్నాడు. ఓనర్ కం డ్రైవర్‌గా ఉపాధి పొందుతున్నాడు. ముగ్గురి మృతితో వారి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.
పరిహారం అందించాలి: ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
ముగ్గురు మృతిచెందడం బాధాకరమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. మృతుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. మరో ఇద్దరి మృతుల కుటుంబాలకు యాజమాన్యం వెంటనే బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని టీబీజీకేఎస్, పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుళ్తామన్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.