
క్యాడర్ స్ట్రెంగ్త్, ఎన్రోల్మెంట్ వివరాల పరిశీలన
జిల్లాలో విలీనమయ్యే స్కూళ్లు ఒక్కటీ లేవు
ఎంఈవోల సమావేశంలో డీఈవో యాదయ్య
ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 18: ప్రభుత్వం పాఠశాల విద్యలో ఎన్నో సంస్కరణలు చేపట్టి బడులను బలోపేతం చేసింది. దీనిలో భాగంగానే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు రేషనలైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో హేతుబద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉన్న క్యాడర్ స్ట్రెంగ్త్ వివరాలను పరిశీలించారు. రేషనలైజేషన్ ప్రక్రియకు చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 21 మండలాలు ఉండగా 18 మండలాల ఎంఈవోలు క్యాడర్ స్ట్రెంగ్త్ సమర్పించారు. మూడు మండలాల క్యాడర్ స్ట్రెంగ్త్ వివరాలు అందాల్సి ఉంది.
డేటా సమర్పించిన ఎంఈవోలు..
విద్యాశాఖ పరిధిలోని తెలుగు, ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలను ఎంఈవోలు పరిశీలించారు. పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ), ప్రధానోపాధ్యాయులు(హెచ్ఎం) హోదాలకు అనుగుణంగా క్యాడర్ స్ట్రెంగ్త్, యూడైస్ ఎన్రోల్మెంట్లను డీఈవోకు ఎంఈఓలు అందజేశారు. రెండు రోజుల నుంచి ఎంఈవోలు సేకరిస్తున్న క్యాడర్ స్ట్రెంగ్త్‌కు ఉన్నతాధికారుల వద్ద ఉన్న క్యాడర్ స్ట్రెంగ్త్‌కు వ్యత్యాసాలు వచ్చాయి. దీనిపై పాఠశాలల వారీగా మరోసారి సమీక్షించుకొని క్యాడర్ స్ట్రెంగ్త్‌ను ధ్రువీకరించుకొని ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల వివరాలను సమర్పించారు. జిల్లాలో కామేపల్లి, సింగరేణి, ఏన్కూరు ఎంఈవోలు ఉపాధ్యాయుల వివరాలు సమర్పించలేదు.
విలీనానికి ఒక్క స్కూలూ లేదు..
రాష్ట్ర ప్రభుత్వం ఒక్క స్కూలును కూడా మూసివేయకుండా ఉపాధ్యాయుల సర్దుబాటు చేసే ప్రక్రియను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా స్కూళ్లను మూసివేయకుండా ఒకే ప్రాంగణ పరిధిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న పాఠశాలలను, వేర్వేరు మాధ్యామాల్లో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను విలీనం చేయనున్నారు. విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం ఖమ్మం జిల్లాలో ఒకే ప్రాంగణం పరిధిలో ఒకటి కంటే అధికంగా ఉన్న స్కూళ్లు లేకపోవడంతో జిల్లాలో ఒక్క స్కూలు కూడా విలీనం కావట్లేదు. ఉపాధ్యాయుల వివరాలను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల ద్వారా సేకరించారు. జిల్లాలో 81 కాంప్లెక్సులు, 21 మండలాలు, ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో రేషనలైజేషన్ ప్రక్రియ జరుగనుంది.
ఎంఈవోలకు సూచనలు..
డీఈవో కార్యాలయంలో బుధవారం ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. రేషనలైజేషన్ మార్గదర్శకాలను, ఉన్నతాధికారుల ఆదేశాలను వారికి వివరించారు. క్ష్రేతస్థాయిలో సేకరించాల్సిన సమాచారాన్ని, వెంటనే డీఈవో కార్యాలయంలో సమర్పించాల్సిన వివరాల ఆవశ్యకతను స్పష్టం చేశారు. డీఈవో కార్యాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ క్యాడర్ స్ట్రెంగ్త్‌లో లోపాలు లేకుండా అందజేయాలని, హేతుబద్ధీకరణ ప్రక్రియలో నిర్లక్ష్యంగా లేకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.