
25 నెలల సుదీర్ఘ విరామం తర్వాత
యాత్రకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
భద్రాచలం, డిసెంబర్17: సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి పాపికొండల యాత్ర ప్రారంభం కానున్నది. కరోనా కారణంగా 25 నెలల పాటు నిలిచిపోయిన విహార యాత్రకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏపీలోని వీఆర్ పురం మందలం పోచవరం నుంచి కొనసాగే ఈ యాత్రను తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంతబాబు, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి ప్రారంభించనున్నారు. గతంలోనే యాత్ర ప్రారంభంకావాల్సి ఉండగా వివిధ కారణాలతో నిలిచిపోయింది. భద్రాచలంలో గోదావరి గుండా ఏపీలోని పాపికొండల వరకు సాగే ఈ యాత్ర తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తులు, బోటు నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఎక్కువగా ఈ విహార యాత్రకు వెళ్తారు. బోటు నిర్వాహకులు ఒక రోజు యాత్రకు పెద్దలకు రూ.930, పిల్లలకు రూ.730గా ధర నిర్ణయించారు. గ్రూప్ ప్యాకెజీ తీసుకుంటే ఒక్కొరికి రూ.830 మాత్రమే వసూలు చేస్తామన్నారు. పోచవరం నుంచి ఎనిమిది బోట్లు సిద్ధంగా ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ప్రయాణికుల రక్షణకు సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు వారు వెల్లడించారు. లాంచీల్లో లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. యాత్రలో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారన్నారు. పర్యాటకుల నుంచి ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరిగా సేకరిస్తామన్నారు. వాటిని రెవెన్యూ అధికారులకు అందిస్తామన్నారు.