ఆకేరు వరద బీభత్సానికి రాకాశితండా అతలాకుతలమైన విషయం విదితమే. ఊరుఊరంతా సర్వం కోల్పోయి కట్టుబట్టలతోనే మిగిలారు. కొందరి ఇళ్లు కూలిపోయాయి. మరికొందరి పొలాలు సాగుకు పనికిరాకుండా పోయాయి. ఎటుచూసినా రాళ్లకుప్పలే దర్శనమిస్తున్నాయి. ఆ భయానక ఘటన జరిగి నెలన్నర గడిచిపోయింది. ఇంతవరకు ప్రభుత్వం వారికి అరకొర సాయమే అందించింది. తడిచిన ధాన్యం కొనుగోలు చేస్తామని సాక్షాత్తూ మంత్రి పొంగులేటి హామీ ఇచ్చినప్పటికీ అటువైపు చూసిన నాథుడే లేడు. రూ.16 వేల చొప్పున అందించిన సాయమూ చాలామందికి అందలేదు. దీంతో ఉపాధి కోసం చాలామంది వలసపోతున్నారు. రాకాశితండావాసుల కష్టాలు ఇంకా కడతేరలేదు.
తిరుమలాయపాలెం, అక్టోబర్ 16: తిరుమలాయపాలెం మండలంలోని రాకాశితండావాసులను ముంపు బాధలు వీడలేదు. ఆకేరు వాగు వరద బీభత్సంతో ముంపు ప్రవాహానికి గురై ఇళ్లు కూలిపోయాయి. పంటపొలాలు ఇసుకమేటలు వేశాయి. ఇండ్లలోని సామాన్లు మొత్తం కొట్టుకుపోయాయి. 20మంది రైతులకు చెందిన సుమారు 150 బస్తాల వడ్లు తడిసాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో పర్యటించిన రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వారికి స్వయంగా హామీ ఇచ్చారు.
కానీ నేటివరకు ఆ తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన నాధుడు లేడు. నష్టపోయిన ప్రజలను అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చినప్పటికీ మంత్రులు, అధికారుల హామీలు అమలుకావడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపునకు తడిచిన వడ్లను ఎండబెట్టి రాశులు పోసి పట్టాలు కప్పారు. వానలకు మళ్లీ వడ్లు తడిచి మొలకలు వస్తున్నాయి. రాశుల వద్ద కాపలా కాయలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై మంత్రి పొంగులేటికి తమ గోడు వెల్లబోసుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని గిరిజనులు వాపోతున్నారు.
ఆకేరు వరద ప్రవాహానికి 50 కుటుంబాలకు చెందిన 300 ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయి, వ్యవసాయ భూములు రాళ్ల కుప్పలుగా, ఇసుక మేటలుగా మారాయి. పచ్చని పంటలు పండే భూములు సాగు చేయడానికి పనికి రాకుండా పోయాయి. అట్టి భూములు మళ్లీ సాగు చేసుకునే విధంగా తయారు చేసుకోవాలంటే ఎకరం ఒక్కంటికి రూ.లక్షకు పైగానే ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయినా ప్రభుత్వం పైసా సాయం కూడా అందించలేదు. దీంతో చేసేదేమీలేక రైతులు కూలీలుగా మారి బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు.
రాకాశితండాలో 77 కుటుంబాలకు గాను 66 కుటుంబాల వారికి ప్రభుత్వం రూ.16,500 చొప్పున వారి అకౌంట్లలో జమ చేశారు. మిగిలిన కుటుంబాల వారికి ఒక్కపైసా రాలేదు. దాతలు అందించిన ఆర్థికసాయం తప్ప ప్రభుత్వం తమకు ఏమీ సాయం చేయలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన పంటలకూ పైసా ఇవ్వలేదని, కూలిపోయిన ఇళ్లు, కొట్టుకుపోయిన సామాన్లకు పరిహారం చిల్లిగవ్వ అందలేదని చెబుతున్నారు.
తడిచిన వడ్లను కొనుగోలు చేస్తామని మంత్రి పొంగులేటి, కలెక్టర్ హామీ ఇచ్చి నెలరోజులైనా ఇంకా కొన్నవారు లేరు. గాలివానలకు పట్టాలు ఎగిరిపోయి వడ్లు తడుస్తున్నాయి. రాశుల వద్ద కాపలా కాయలేక ఇబ్బంది పడుతున్నాము. మా వడ్లు 80 బస్తాలు తడిచి మొలకలు వస్తున్నాయి. ఏమి చేయాలో తోచడం లేదు.
-పోతుగంటి సహదేవ్, రైతు, రాకాశితండా
చాలామంది దాతలు నిత్యావసర వస్తువులు అందించారు. ప్రభుత్వం నుంచి మాత్రం అరకొర సహాయమే అందింది. పంటలు, దెబ్బతిన్న భూములకు చిల్లగవ్వ కూడా ఇవ్వలేదు. మంత్రులు, జిల్లా అధికారులు హామీలు ఇచ్చారు తప్ప అమలు కాలేదు. కొంతమందికి రూ.16 వేలు కూడా రాలేదు.
-బానోత్ మోహన్, రైతు, రాకాశితండా