
భవిష్యత్‌లో పది నియోజకవర్గాల్లో కారుదే విజయం
మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
తాతా మధుకు పలువురి శుభాకాంక్షలు
ఖమ్మం, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని టీఆర్ఎస్ భవన్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, తాతా మధుసూదన్‌తో కలిసి మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలపై ఎవరెన్ని అవాకులు, చవాకులు పేలినా.. రాజకీయ కుట్రలు చేసినా.. ఫలితం టీఆర్ఎస్నే వరించిందన్నారు. ఈ విజయం పార్టీ శ్రేణులందరిదని మంత్రి అభిప్రాయ పడ్డారు. తాతా మధు గెలుపులో భాగస్వాములైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో గులాబీజెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేండ్లలో 8 ఎన్నికలు జరిగాయని అన్నింటిలో ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ గెలుపునకు కారణమన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదని ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా మరోసారి రుజువైందన్నారు. కొన్ని రాజకీయ పార్టీల కలలు పగటి కలలుగానే మిగిలాయని విమర్శించారు. మధు గెలుపునకు సహకరించిన సీపీఐ నాయకులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్‌కు గుణపాఠం : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో గెలిచే బలం లేకపోయినా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తగిన బుద్ధి చెప్పారని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన ఓటర్లు చెక్కు చెదరలేదని గులాబీ అభ్యర్థికి మద్దతు ఇచ్చి గెలిపించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ పాలనకు మెచ్చే ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తున్నారన్నారు.
శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా.. : తాతా మధుసూదన్
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, వెన్నుతట్టి ప్రోత్సహించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావుకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానని తాతా మధుసూదన్ పేర్కొన్నారు. తన విజయంలో కీలక పాత్ర పోషించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గొంతుక అవుతానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియానాయక్, కందాళ ఉపేందర్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వర్రావు శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించిన తాతా మధుకు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, భద్రాచలం, కొత్తగూడెం నియోజకవర్గాల ఇన్చార్జీలు తెల్లం వెంకట్రావు, వనమా రాఘవ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్లు అంగోతు బిందు, కోరం కనకయ్య, టీఆర్ఎస్ నాయకులు వద్దిరాజు రవిచంద్ర, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు ఖమర్, దిండిగాల రాజేందర్, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, ఖమ్మం మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ సీతామహాలక్ష్మి, జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, వెంకటేశ్వరరావు, నాగరాజు, మురళీ పాల్గొన్నారు.