
భద్రాచలం, డిసెంబర్ 14: భద్రాద్రి రామయ్యను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ, ఎలక్టోరల్ అబ్జర్వర్ ఈ.శ్రీధర్ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు మేళతాళాలతో స్వాగతం పలికారు. ముందుగా ఆయన ధ్వజస్తంభం వద్ద, అనంతరం గర్భగుడిలోని మూలమూర్తుల వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న భద్రుని కోవెలను, లక్ష్మీ తాయారు అమ్మవారిని, ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందజేసి స్వామివారి పట్టువస్ర్తాలను, ప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకున్న తరువాత ఐటీసీ అతిథిగృహానికి చేరుకున్నారు. అక్కడ ఆయనను ఐటీసీ అధికారులు, గిరిజన శాఖ అధికారులు శాలువాలు, మెమెంటోలతో సత్కరించారు. దేవస్థానం ఈవో శివాజీ, ఆలయ ప్రధానార్చకులు విజయరాఘవన్, తహసీల్దార్లు శ్రీనివాస్ యాదవ్, భగవాన్‌రెడ్డి, ఏటీడీవో నరసింహారావు, ఏటీడీఏ రూపాదేవి పాల్గొన్నారు.
రామయ్యకు నిత్య వైభవం
శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా గాలిగోపురానికి అభిముఖంగా ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో పంచామృతాలతో అభిషేకం, తమలపాకులతో, గంధ సింధూరంతో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం బేడా మండపంలో స్వామివారిని ఉంచి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.