
ఖమ్మం నగరంలో నేడు ఉదయం7 గంటలకు ప్రారంభం
ఉదయం 11 గంటల వరకు ఫలితం
గుర్తింపు కార్డులు ఉన్నవారికే అనుమతి
కేంద్రం వద్ద మూడు అంచెల భద్రత
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు కలెక్టర్ వీపీ గౌతమ్
మొత్తం 768 ఓట్లు … పోలైనవి 738
ఖమ్మం, డిసెంబర్13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెరపడనున్నది. విజేతలెవరో తేలనున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నాలుగు కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 768 ఓటర్లకు గాను 738 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. నగరంలోని జిల్లా పంచాయతీరాజ్ వనరుల కేంద్రం (డీపీఆర్సీ)లో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటలకు అభ్యర్థులు, ఎన్నికల, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్‌ల సీల్ ఓపెన్ చేయనున్నారు. అనంతరం లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానున్నది. గుర్తింపు కార్డులు ఉన్నవారినే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించనున్నారు. కేంద్రం వద్ద మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల వరకు ఫలితం వెలువడే అవకాశం ఉంది.
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. నగరంలోని డీపీఆర్సీ భవన్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లో సోమవారం విలేకరుల సమావేశంలో సీపీ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 10న ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేశామని, 768 మంది ఓటర్లకుగాను 738 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్కులను డీపీఆర్సీ భవనంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూంలో ఉంచామన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 14న కౌంటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా బ్యాలెట్ బాక్సులకు మంగళవారం ఉదయం 7 గంటలకే అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో వీడియో చిత్రీకరణతో సీల్ తెరుస్తామన్నారు. అనంతరం బాక్సుల్లో ఉన్న బ్యాలెట్ పత్రాలను లెక్కించి పోలింగ్ రోజు నమోదైన 738 బ్యాలెట్ పత్రాల లెక్కకు సరి చూస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత నాలుగు పెట్టెల్లో ఉన్న అన్ని బ్యాలెట్ పత్రాలను ఒక డ్రమ్‌లో వేసి కలుపుతామని, తరువాత లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. పోలైన ఓట్లలో నుంచి చెల్లని ఓట్లను ముందుగా గుర్తించి వేరు చేస్తామన్నారు. ఆ తరువాత మొదటి రౌండ్లో పోటీలో ఉన్న అభ్యర్థుల వారీగా మొదటి ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తామని తెలిపారు. అందులో చెలుబాటులో ఉన్న ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తామన్నారు. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఏ అభ్యర్థికీ స్పష్టమైన మెజార్టీ రాకుంటే రెండో రౌండ్లో అభ్యర్థుల ఎలిమినేషన్‌తోపాటు రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తామని వివరించారు. ఇలా పోలై చెల్లుబాటులో ఉన్న ఓట్లలో 50 శాతం ఓట్లు ఎవరికైతే వస్తాయో వారినే విజేతలుగా ప్రకటిస్తామని తెలిపారు.
గుర్తింపు కార్డులు ఉన్నవారికే అనుమతి..
ఓట్ల లెక్కింపులో భాగంగా గుర్తింపు కార్డులు ఉన్నవారినే లోపలికి అనుతిస్తామని కలెక్టర్ వీపీ గౌతమ్ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోటీ చేసిన అభ్యర్థులతోపాటు వారి ఎన్నికల ఏజెంట్లకు, కౌంటింగ్ ఏజెంట్లకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ నాలుగు టేబుళ్లలో జరుగుతుందని, ఒక్కో అభ్యర్థికి ఒక్కో టేబుల్‌కు ఒక ఏజెంటు చొప్పున నలుగురు అభ్యర్థులకు నలుగురు పోలింగ్ ఏజెంట్ల చొప్పున 16 మంది ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తామని వివరించారు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదన్నారు.
మూడంచెల భద్రత: సీపీ విష్ణు
కౌంటింగ్ కేంద్రం వద్ద మూడు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. కౌంటింగ్‌లో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టామన్నారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, అడిషనల్ డీసీపీ గౌస్అలం పాల్గొన్నారు.