
ఇక నుంచి ప్రతి గురువారం బస్ డే కార్యక్రమం
ప్రయాణికుల సమస్యలు తెలుసుకునేందుకే ఈ ప్రోగ్రాం
ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ సాలోమాన్
ఖమ్మం, డిసెంబర్ 13: ప్రజలనే దేవుళ్లుగా భావిస్తూ వారికి మరిన్ని సేవలందించే లక్ష్యంతో ఆర్టీసీ ముందుకెళ్తోందని ఆ సంస్థ ఖమ్మం రీజినల్ మేనేజర్ సాలోమాన్ తెలిపారు. ఖమ్మం నూతన బస్టాండ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఆర్టీసీ సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు.బస్ డే సందర్భంగా ప్రతి గురువారం ఆర్టీసీ ఉద్యోగులంతా బస్సుల్లో ప్రయాణిస్తారని అన్నారు. ప్రయాణికుల సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఖమ్మం రీజియన్‌లో సంస్థకు సుమారు రూ.80 లక్షల ఆదాయం వస్తోందని, మొత్తం 630 బస్సులు ఉండగా వీటిలో సంస్థవి 346 బస్సులు, అద్దెవి 284 బస్సులు ఉన్నట్లు వివరించారు. రీజియన్‌లో ప్రతి రోజూ 2.65 లక్షల కిలోమీటర్ల దూరం బస్సులు ప్రయాణిస్తాయని తెలిపారు. ప్రతి కిలోమీటరుకూ ఆదాయాన్ని లెక్కిస్తే రూ.13.08 చొప్పున నష్టం వస్తోందన్నారు. 265 పల్లె బస్సులు ప్రజలకు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని, ప్రతి గ్రామానికీ ఆర్టీసీ బస్సును నడుపుతున్నామని ఆర్ఎం తెలిపారు. 1 నుంచి 10 తరగతుల బాలికలకు, 1 నుంచి 7 తరగతుల బాలురకు ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పించామన్నారు. కళాశాలల విద్యార్థులకు తక్కువ ధరతో రాయితీ బస్ పాస్‌లను ఇచ్చినట్లు చెప్పారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి బెంగళూరు, చెన్నై, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, కూకట్పల్లి, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నామని, రాష్ట్ర రాజధానికి ప్రతి ఐదు నిమిషాలకు ఒకటి చొప్పున ప్రతి రోజూ 180 ట్రిప్పులను నడుపుతున్నామని వివరించారు. ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా వివాహాలకు, శుభకార్యాలకు అన్ని రకాల బస్సులను తక్కువ ధరలకే అద్దెకు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకుని ఆర్టీసీ సేవలు పొందాలని కోరారు. డివిజనల్ మేనేజర్ సుగుణాకర్, ఖమ్మం డిపో మేనేజర్ శంకర్రావు, డిపో చీఫ్ ఇన్స్పెక్టర్ స్వామి, స్టేషన్ మేనేజర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.