
తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనే టీఆర్ఎస్ గెలిచే అవకాశం
మెజారిటీ ఉండడంతో నల్లేరుపై నడకలానే ‘మధు’ విజయం
ఖమ్మం డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం మంగళవారం అధికారికంగా ఖరారు కానుంది. ఈ నెల 10న ఎన్నికలు జరుగగా.. అధికారులు మంగళవారం ఖమ్మంలో ఓట్లను లెక్కించనున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడానికి అవసరమైన మెజార్జీ ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థి తాతా మధుసూదన్ విజయం నల్లేరుపై నడకేనని, పోటీ నామమాత్రమేనని టీఆర్ఎస్ వర్గాలు ఆది నుంచీ భావిస్తూ వచ్చాయి. 768 ఓట్లకు గాను దాదాపు 550 ఓట్లకు పైగా బలం టీఆర్ఎస్కే ఉంది. దీంతోపాటు సీపీఐ కూడా టీఆర్ఎస్కు మద్దతిచ్చింది. అలాగే కొంతమంది సీపీఎం ప్రజాప్రతినిధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తిరుగులేని విజయం లభిస్తుందని, అనూహ్యమైన మెజార్టీ వస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నేతృత్వంలో 15 రోజులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ శాసనసభ్యులు ఆయా నియోజకవర్గాల్లో తమ పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమై ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించాల్సిన అవశ్యకతను వివరించారు. మొత్తం నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్‌కు ఎవరూ పెద్దగా పోటీ ఇవ్వలేదన్న భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమైంది. కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు, ఎంపీటీసీ సంఘం నుంచి కొండపల్లి శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థిగా కొండ్రు సుధారాణి బరిలో నిలిచారు. ఈ నెల 10న జరిగిన పోలింగ్ సరళిని బట్టి చూస్తే టీఆర్ఎస్కే భారీ మెజార్టీ లభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. తాతా మధు విజయం కోసం పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయడంతో భారీ మెజార్టీకి అవకాశం లభించినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ విజయం కోసం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి జిల్లా వ్యాప్తంగా పర్యటించి ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. తాతా మధు వంటి విద్యావంతుణ్ని శాసనమండలికి పంపించడం వల్ల ప్రజాసమస్యల పరిష్కారానికి జిల్లా నుంచి మరో బలమైన గొంతుకను ఇచ్చినట్లు అవుతుందని ఆయా నేతలు పలు సమావేశాల్లో వివరించారు. నామమాత్రపు బలం ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అవకాశం లేకపోయినా తమ బలాన్ని నిరూపించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఎన్నిక ఏదైనా విజయం టీఆర్ఎస్దే అనే నానుడి మరోసారి నిరూపితం కాబోతున్నదని టీఆర్ఎస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.