
స్థానికత ఆధారంగా విభజన
ఇకపై 95 శాతం ఉద్యోగులకు స్థానిక రిజర్వేషన్ వర్తింపు
ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటికే జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులపై స్పస్టత
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ):పాత విధానాలకు తెలంగాణ సర్కారు చరమగీతం పలికింది. 50 ఏళ్లకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్యాడెర్ స్ట్రెంగ్త్ పోస్టుల్లేక సర్దుబాటుతో ఉద్యోగాలు చేసి విసిగిపోయిన ఉద్యోగులకు కొత్త జోనల్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. జిల్లా, జోన్, మల్టీ జోన్ పరిధిని పరిగణనలోకి తీసుకొని ఉద్యోగుల విభజన పూర్తి చేసింది. దీంతో ఉద్యోగుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ నెల చివరి కల్లా పూర్తిస్థాయిలో జోనల్ వ్యవస్థ కార్యాచరణ పూర్తి కానుంది. స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయి పోస్టులకు కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ పనిచేయనుండగా… ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు అందులో సభ్యులుగా ఉంటారు. జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విభజనను సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షించనుంది. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకొని సీనియార్టీ ప్రాతిపదికన స్థానికత ఆధారంగా విభజనను చేపట్టనున్నారు. ఈ కేటాయింపులతో ఉద్యోగాల భర్తీకీ లైన్ క్లియర్ కానుంది.
ఎక్కడి ఉద్యోగాలు అక్కడి వారితోనే..
రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త జోనల్ విధానంలో ఉద్యోగ నియామకాలు జరగలేదు. ఇంజినీరింగ్, వైద్య విద్య ప్రవేశాలను సైతం రెండు జోన్లు, 10 జిల్లాల విధానం ఆధారంగానే చేపట్టారు. ఇప్పుడు కొత్త జోనల్ విధానం ఆమోదం పొందడంతో ఇకపై ఉద్యోగ నియామకాలు ఈ విధానం ఆధారంగానే జరుగనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఆర్డర్ టు సర్వ్ విధానంలో ఉద్యోగుల కేటాయింపులు జరిగాయి. ఇప్పుడు నూతన విధానం రావడంతో ఇక నుంచి జిల్లాలు, జోన్ల వారీగా ఉద్యోగుల సంఖ్య ఖరారు కానుంది. దీని ఆధారంగా ఉద్యోగుల శాశ్వత కేటాయింపుల ప్రక్రియ ఉంటుంది. కొత్తగా నియమితులైన వారికి సైతం జోనల్ కేటాయింపులు సులభం కానున్నాయి.
పాత జోనల్ వ్యవస్థకు స్వస్తి..
ఉమ్మడి రాష్ట్రంలో పాత జిల్లాల ప్రకారం జోనల్ వ్యవస్థ అమలైంది. ఐదు, ఆరో జోన్ ప్రాతిపదికన కొనసాగిన వ్యవస్థ ఈ ఏడాది ప్రారంభంలోనే రద్దయింది. తాజాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీ లోని (1) (2) క్లాజులను అనుసరించి తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఆర్డర్ 2016 ప్రకారం రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లు, ఏడు జోన్లు ఆవిర్భవించాయి. మల్టీ జోన్-1ను నాలుగు జోన్లుగా, మల్టీ జోన్-2ను మూడు జోన్లుగా విభజించారు.
ఉద్యోగుల పునర్వ్యస్థీకరణ ఇలా..
టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, డ్రైవర్, రికార్డు అసిస్టెంట్, లెనో ఆపరేటర్, జమేదార్, చైన్‌మెన్, జమేదార్, కుక్, ఆఫీస్ సబార్డినేట్, శానిటరీ వర్కర్, స్వీపర్, వాచ్మెన్, ఫోర్‌మెన్, కార్పెంటర్, మేస్త్రీ, గార్డెనర్, చౌకీదార్, ప్రింటింగ్ టెక్నీషియన్, కానిస్టేబుల్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 తదితర పోస్టులన్నింటినీ జిల్లా క్యాడర్లో నిర్దారించారు. నయాబ్ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, ఎంఆర్ఐ, ఏఆర్ఐ, సీనియర్ స్టెనో, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, సూపరింటెండెంట్, నాన్ టెక్నికల్ పర్సనల్ ఆసిస్టెంట్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, సీనియర్ డ్రైవర్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1,2,3, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-2 పోస్టులు జోనల్ క్యాడర్లో ఉన్నాయి. డిప్యూటీ కలెక్టర్ (ఆర్డీవో), అసిస్టెంట్ సెక్రటరీ, సూపరింటెండెంట్, తహసీల్దార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, సీఐ, డీఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ -1, 2, అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, హెల్త్ ఇన్స్ట్రక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి, ఎంపీడీవో, మండల పంచాయతీ అధికారి, అగ్రికల్చర్ అధికారి, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-1, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్లు గ్రేడ్ – 2,3 అధికారులు మల్టీ జోనల్ పోస్టుల పరిధిలో ఉన్నారు.
దూర ప్రాంతాలు వెళ్లే భారం తప్పింది..
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పాత జోనల్ వ్యవస్థను సమూలంగా మార్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దూర ప్రాంతాలు వెళ్లి విధులు నిర్వహించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన జోన్లోనే మనం ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కలిగింది. ఇదేగాక కొత్త జిల్లాకు కొత్త పోస్టులు వస్తాయి. దీని వల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. చిన్న ఉద్యోగులు స్థానికంగా సొంత జిల్లాలో ఉద్యోగం చేసుకోవచ్చు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు శుభపరిణామం.
-భగవాన్‌రెడ్డి. తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, భద్రాద్రి