
బృహత్ పల్లె ప్రకృతి వనాలకు ముగిసిన భూసేకరణ
మరో నాలుగు మండలాల్లో మినీ వనాలకు స్థల సేకరణ
ఒక్కో ఎకరంలో 3 వేల మొక్కలు పెంచేలా ప్రణాళిక
భవిష్యత్లో చిట్టడవిని తలపించనున్న వనాలు
కొత్తగూడెం అర్బన్, నవంబర్ 13: ‘మొక్కల పెంపకానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యాన్నిస్తున్నది.. ఇప్పటికే ఏడు విడతల్లో హరితహారాన్ని విజయవంతం చేసిన సర్కార్ పల్లె ప్రగతి పథకంలో భాగంగా గ్రామగ్రామానా ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. అలాగే ప్రతి మండలానికి ఒక ‘బృహత్ పల్లె ప్రకృతి వనం’, అవసరం ఉన్న చోట ‘మినీ బృహత్ పల్లె ప్రకృతి వనం’ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది.. అధికారులు ఇప్పటికే బృహత్ వనాలకు స్థల సేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. వాటిలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
హరితహారం’ ద్వారా మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గడిచిన ఆరు హరితహారాల్లో అన్ని పంచాయతీలు, పట్టణాల్లో మొక్కలు నాటే కార్యక్రమం యజ్ఞంలా సాగింది. దీంతోపాటు అన్ని మండలాల్లో, పట్టణాల్లో కొంత స్థలం సేకరించి శాశ్వతంగా నిలిచేలా పల్లె, పట్టణ ప్రకృతివనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగా భద్రాద్రి జిల్లా అధికారులు ఆయా ప్రాంతాల్లో స్థల సేకరణ చేపట్టి వనాలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి మండలంలో ‘బృహత్ పల్లె ప్రకృతి వనం’, ‘మినీ బృహత్ పల్లె ప్రకృతి వనం’ ఏర్పాటు చేసేందుకు స్థలాలు సేకరించి వనాల ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
భూ సేకరణ పూర్తి
ప్రస్తుతం అడవులు అంతరించిపోవడంతోపాటు స్వచ్ఛమైన గాలిని పీల్చే పరిస్థితి లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి మండలంలోనూ 8 నుంచి 10 ఎకరాల్లో ‘బృహత్ పల్లె ప్రకృతి వనం’, 5 -7 ఎకరాల్లో ‘మినీ బృహత్ పల్లె ప్రకృతి వనం’ ఏర్పాటు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే భద్రాద్రి జిల్లాలోని 23 మండలాల్లో కొత్తగూడెం మినహా 18 మండలాల్లో ఈ వనాలను ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ పూర్తయింది. అశ్వారావుపేట, బూర్గంపహాడ్, చండ్రుగొండ, దుమ్ముగూడెం మండలాల్లో సేకరించిన స్థలం కొంత వివాదంలో ఉండడంతో ప్రత్యామ్నాయంగా స్థలాన్ని సేకరించేందుకు అధికారులు సర్వే చేస్తున్నారు. ఆళ్లపల్లి మండలం ఆళ్లపల్లి పంచాయతీలో 6.50 ఎకరాల్లో 10,250 మొక్కలు, అన్నపురెడ్డిపల్లిలో పెద్దిరెడ్డిగూడెం పంచాయతీలో 8 ఎకరాల్లో 24 వేల మొక్కలు, భద్రాచలం పంచాయతీలో 6.01 ఎకరాల్లో 15,140 మొక్కలు, చుంచుపల్లి మండలం త్రీ ఇైంక్లెన్ పంచాయతీలోని 10 ఎకరాల్లో 31 వేల మొక్కలు, దమ్మపేటలో పెద్దగొల్లగూడెం పంచాయతీలో 4.62 ఎకరాల్లో 13,700 మొక్కలు, గుండాల పంచాయతీలో 7.06 ఎకరాల్లో 17,920 మొక్కలు, జూలూరుపాడు పంచాయతీలో 7.50 ఎకరాల్లో 15 వేల మొక్కలు, కరకగూడెంలో సమత్ బట్టుపల్లి పంచాయతీలో 7.50 ఎకరాల్లో 18 వేల మొక్కలు, లక్ష్మీదేవిపల్లి లోతువాగు పంచాయతీలో 7.50 ఎకరాల్లో 16,062 మొక్కలు, మణుగూరులో ముత్యాలమ్మనగర్ పంచాయతీలో 6.20 ఎకరాల్లో 17 వేల మొక్కలు, ములకలపల్లి పంచాయతీలో 8 ఎకరాల్లో 24 వేల మొక్కలు, పాల్వంచలో బసవతారకం కాలనీలో 8 ఎకరాల్లో 22,500 మొక్కలు, పినపాకలో పత్తిరెడ్డిపాలెంలో 8 ఎకరాల్లో 24 వేల మొక్కలు, సుజాతనగర్లో లక్ష్మీదేవిపల్లి పంచాయతీలో 10 ఎకరాల్లో 31 వేల మొక్కలు, టేకులపల్లిలో 9వ మైలుతండాలో 8 ఎకరాల్లో 21 వేల మొక్క లు, ఇల్లెందులో రొంపేడు పంచాయతీలో 8 ఎకరాల్లో 18వేల మొక్కలు, చర్ల పంచాయతీలో 8 ఎకరాల్లో 20, 050 మొక్కలు, అశ్వాపురం మండలంలో మల్లెలమడు గు పంచాయతీలో 8 ఎకరాల్లో 12 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం 166. 89ఎకరాల్లో 3.60లక్షల మొక్కలు పెంచనున్నారు.
ఒక్కో ఎకరంలో 3 వేల మొక్కలు
ఒక్కో ఎకరంలో 2500 – 3000 మొక్కలను నాటేలా కార్యాచరణ రూపొందించారు. ప్రస్తుతం బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో భూసేకరణ పూర్తవడంతోపాటు మొక్కలనూ నాటారు. మండలాల్లో 33 మినీ వనాలకు భూ సేకరణ పూర్తయింది. మొత్తంగా 51 వనాల్లో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి.
చిట్టడవిని తలపించేలా..
ప్రతి మండలంలో ఒక చిట్టడవిని తలపించేలా బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు కానున్నాయి. అంతరించిపోతున్న వృక్షసంపదను కాపాడుకోవడంతోపాటు అరుదైన వృక్షజాతి మొక్కలను పెంచనున్నారు.
పనులు జరుగుతున్నాయి..
బృహత్ పల్లె ప్రకృతి వనాలకు భూ సేకరణ పూర్తయింది. 18 మండలాల్లోని వనాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. మరో నాలుగు మండలాల్లో ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించే పనిలో ఉన్నాం. మినీ బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తాం. ఈ నెల చివరిలోపు మొక్కలు నాటే పనిని పూర్తి చేస్తాం.
-మధుసూదనరాజు, డీఆర్డీవో, కొత్తగూడెం