తెలంగాణ ప్రభుత్వం కర్షకులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. పెట్టుబడి మొదలుకొని పండించిన పంటను మద్దతుధరకు కొనుగోలు చేస్తున్నది. ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా సర్కారే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాలో 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. పీఏసీఎస్ పరిధిలో 99, జీసీసీ పరిధిలో 32, ఐకేపీ పరిధిలో మూడు కలిపి మొత్తం 134 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది. వీటిలో ఇప్పటికే 54 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. త్వరలో మరిన్ని కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యం గ్రేడ్-1 రకానికి క్వింటాకు రూ.2,060, కామన్ రకానికి రూ.2,040 చొప్పున ప్రభుత్వం ధర నిర్ణయించింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన కొద్దిరోజుల్లోనే వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నది. అంతేకాదు, పొరుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి అక్రమంగా ధాన్యం తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అశ్వారావుపేట, భద్రాచలంలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): యాసంగిలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. భద్రాద్రి జిల్లా నుంచి 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. అధికారులు పీఏసీఎస్ పరిధిలో 99, జీసీసీ పరిధిలో 32, ఐకేపీ పరిధిలో మూడు.. ఇలా మొత్తం 134 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఇప్పటికే 54 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. త్వరలో అన్ని కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యం గ్రేడ్-1 రకానికి ఒక క్వింటాకు రూ.2,060, కామన్ రకానికి రూ.2,040 చొప్పున ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన కొద్దిరోజుల్లోనే వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ కానున్నది. కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది, నిర్వాహకులకే స్థానిక కూలీలతో పాటు ఉపాధి లభించనున్నది.
రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చేముందు ఆరబెట్టాలి. ధాన్యంలో చెత్త, తాలు, పొల్లు, మట్టి లేకుండా చూడాలి. ధాన్యం నాణ్యత, తేమ శాతాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. కొనుగోలు సంబంధిత విషయాల గురించి తెలుసుకోవడానికి రైతుబంధు సమితి సభ్యులు, వ్యవసాయ విస్తరణ అధికారుల సాయం తీసుకోవచ్చు. కేంద్రాల్లో ధాన్యం నాణ్యతా ప్రమాణాలను వ్యవసాయశాఖ అధికారులు పర్యవేక్షిస్తారు. తహసీల్దార్‌తో కలిసి ధాన్యం కొనుగోలు తేదీలను ప్రకటిస్తారు.
ప్రతి రైస్ మిల్లర్ జిల్లా మేనేజర్ వద్ద తప్పనిసరిగా అగ్రిమెంట్ చేయించుకోవాలి. ఫాం ఏ-2 రిజిష్టర్ నిర్వహించాలి. రిజిష్టర్‌లో సీఎంఆర్ ధాన్యానికి సంబంధించిన వివరాలు, ధాన్యం కొనుగోలు, ధాన్యం ఆడించిన వివరాలు, సీఎంఆర్ డెలివరీకి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. రైస్ మిల్లర్ల యాజమానుల సంఘం ప్రెసిడెంట్ రైస్ మిల్లర్లను సమన్వయపరుస్తూ సకాలంలో ధాన్యాన్ని దిగుమతి చేయించాలి. ధాన్యం నాణ్యతపై కొనుగోలు కేంద్రాల ఇన్చార్జులు, జిల్లా మేనేజర్‌కు సమాచారం అందించాలి. అనంతరం ధాన్యాన్ని జిల్లా మేనేజర్ కేటాయించిన గోడౌన్లలో దిగుమతి చేయాలి.
పొరుగు రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి అక్రమంగా ధాన్యం తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అశ్వారావుపేట, భద్రాచలంలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. పోలీసులు, విజిలెన్స్, వ్యవసాయశాఖ అధికారులు వాటిపై నిఘా ఉంచుతారు. ఈ అంశంపై ఇప్పటికే కలెక్టర్ అనుదీప్ సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించారు. నిఘా మరింత పెంచాలని తహసీల్దార్లకు బాధ్యతలను అప్పగించారు.
యాసంగిలో వరి కోతలు ఆలస్యమయ్యాయి. అయినప్పటికీ రైతుల సౌకర్యార్థం జిల్లావ్యాప్తంగా 134 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 54 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. వేసవి దృష్ట్యా కేంద్రాల వద్ద రైతుల కోసం తాగునీటి వసతి కల్పిస్తున్నాం. ధాన్యం నింపేందుకు కావాల్సిన గన్నీ బ్యాగ్‌లను అందుబాటులో ఉంచుతున్నాం. కలెక్టర్ అనుదీప్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
– ఎస్.త్రినాథ్‌బాబు, సివిల్ సైప్లె అధికారి, కొత్తగూడెం