
మణుగూరు రూరల్, డిసెంబర్ 12 : ప్రజా రక్షణ పనిలో నిత్యం తలమునకలయ్యే పోలీసులకు క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని ఎస్పీ సునీల్‌దత్ అన్నారు. ఆదివారం ఏఎస్పీ డాక్టర్ శబరీష్ అధ్యక్షతన పీపీఎల్(పోలీస్ ప్రీమియర్ లీగ్) పీవీకాలనీ భద్రాద్రి స్టేడియం, మణుగూరు రాజుపేట గ్రౌండ్స్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేయగా భద్రాద్రి స్టేడియంలో పోటీలను ఎస్పీ ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి, శాంతికపోతాలను ఎగురవేశారు. పోటీల్లో పాల్గొన్న 10 జట్ల క్రీడాకారులనుద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు కుటుంబాలను సైతం వదులుకుని ప్రజా రక్షణ కోసం పనిచేస్తారని, అలాంటి వారందరికీ క్రీడలు ఉత్తేజాన్ని కలిగిస్తాయన్నారు. అందరూ ఉత్సాహంగా పాల్గొని గెలుపోటములను సమభావంతో స్వీకరించాలన్నారు. పోటీలు నిర్వహిస్తున్న మణుగూరు పోలీసు అధికారులను అభినందించారు. తొలి మ్యాచ్ డీపీఓ- పాల్వంచ, ఓఎస్డీ ఆఫీస్- కొత్తగూడెం జట్ల మధ్య జరగ్గా ఎస్పీ సునీల్‌దత్ చక్కని బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ శబరీష్, కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు, సీఐలు ముత్యం రమేశ్, శ్రీనివాసరావు, రాజగోపాల్, నాగరాజు, బరపాటి రమేశ్, ఎస్ఐలు నరేశ్, టీవీఆర్ సూరి పాల్గొన్నారు.
తొలిరోజు మ్యాచ్‌ల వివరాలు..
తొలిరోజు కొత్తగూడెం డీపీవో, పాల్వంచ జట్లు తలపడగా పాల్వంచ జట్టు విజయం సాధించింది. మణుగూరు ఏఎస్పీ-1, ఇల్లెందు జట్లు తలపడగా మణుగూరు ఏఎస్పీ-1 జట్టు గెలుపు సాధించింది. పాల్వంచ, మణుగూరు-2 జట్లు తలపడగా పాల్వంచ జట్టు గెలిచింది. కొత్తగూడెం ఓఎస్డీ-1, కొత్తగూడెం డీఎస్పీ జట్లు తలపడగా కొత్తగూడెం ఓఎస్డీ-1 జట్టు విజయం సాధించింది. భద్రాచలం, కొత్తగూడెం టీఎస్ ఎస్పీ జట్లు తలపగా భద్రాచలం జట్టు గెలిచింది. ఓఎస్డీ-1, ఓఎస్డీ -2 జట్లు తలపడగా ఓఎస్డీ-1 జట్టు విజయం సాధించింది.