
డయాలసిస్‌కు అందుబాటులో కేంద్రాలు
భద్రాద్రి జిల్లాలో రెండు ఆస్పత్రులు
రూ.1.40 కోట్ల నిధులతో నిర్మాణం
పాల్వంచలో మరో కేంద్రం ఏర్పాటుకు చర్యలు
కొత్తగూడెం, సెప్టెంబర్ 12:డయాలసిస్ అంటే ఖర్చుతో కూడుకున్నది… వారం వారం రక్తాన్ని శుద్ధి చేయించుకోకుంటే ప్రాణానికే ప్రమాదం.. అందుకు ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిందే.. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇది మోయలేని భారం.. ఈ సమస్యను గుర్తించిన తెలంగాణ సర్కార్ 2018లో కిడ్నీ వ్యాధి బాధితుల కోసం జిల్లాకో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. దీనిలో భాగంగా కొత్తగూడెం, భద్రాచలం ఏరియా ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.. దీంతో మూత్రపిండాల వ్యాధి బాధితులకు వ్యయ ప్రయాసలు తప్పాయి.. తమకు అందుబాటులో కేంద్రాలు ఏర్పాటు చేసినందుకు బాధితులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.
ఒకప్పుడు మూత్రపిండాలు పాడై బాధితులు డయాలసిస్ చేయించుకోవాలంటే భద్రాద్రి జిల్లా వాసులు ఖమ్మం, హైదరాబాద్‌తో పాటు పొరుగు రాష్ట్రంలోని విజయవాడ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. వారానికి కనీసం రెండుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తేవి. ఈ క్రమంలో ఆస్తి పాస్తులు అమ్ముకున్నవారూ లేకపోలేదు. మనిషికి వచ్చే కొన్ని వ్యాధులకు మందులు వాడితే నయమైపోతుంది. మరికొన్ని వ్యాధులకు శస్త్రచికిత్స చేస్తే సరిపోతుంది. కానీ ఒక్కసారి కిడ్నీలు పాడయ్యాయంటే డయాలసిస్ ఒక్కటే దారి. డాక్టర్లు సూచించిన సమయంలో డయాలసిస్ కేంద్రాలకు వెళ్లి రక్తాన్ని శుద్ధి చేయించుకోవాల్సిందే. అవసరాన్ని బట్టి వారానికి ఒకసారి, రెండుసార్లు, కొందరికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. మూత్రపిండ వ్యాధి బాధితుల సమస్యను గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని 2018లో నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో బాధితులు డయాలసిస్ సేవలు పొందుతున్నారు. రెండు ఆస్పత్రుల్లో కలిపి డయాలసిస్ కేంద్రాల్లో 10 బెడ్లు ఏర్పాటయ్యాయి. ఇప్పటివరకు కొత్తగూడెం ఆస్పత్రిలో 18,902 సార్లు, భద్రాచలంలో 18,175 సార్లు బాధితులు రక్తాన్ని శుద్ధి చేయించుకున్నారు.
అందుబాటులో సేవలు..
నిరుపేదల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. దీనిలో భాగంగా భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో డయాలసిస్ యూనిట్లు ఏర్పాట్లు చేసింది. రూ.1.40 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్స్ బాధితులకు భరోసానిస్తున్నాయి. ఈ రెండు కేంద్రాల్లో 106 మంది మూత్రపిండ వ్యాధి బాధితులు నిర్దేశిత సమయానికి వచ్చి డయాలసిస్ చేయించుకుంటున్నారు. మరో 80 మంది బాధితులు డయాలసిస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో వీరికీ సేవలు అందనున్నాయి. సర్కారు ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందుతుండడంతో వారికి ఆర్థిక భారం తప్పింది. గతంలో వ్యయప్రయాసలకోర్చి దూర ప్రాంతాల్లో డయాలసిస్ చేయించుకున్న వారు ఇప్పుడు తమకు అందుబాటులో ఉన్న కేంద్రాల్లోనే వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకునే అవకాశం ఏర్పడింది. త్వరలో పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
బాధితులకు మెరుగైన సేవలు
మూత్రపిండ వ్యాధి బాధితులకు అండగా ప్రభుత్వం నిలుస్తున్నది. వారి కోసం జిల్లాకేంద్రంతో పాటు భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. త్వరలో పాల్వంచలోనూ ఏర్పాటు చేసేందుకు వైద్యారోగ్యశాఖ చర్యలు తీసుకుంటున్నది. గతంలో వ్యాధి బాధితులు డయాలసిస్ కోసం ఇబ్బందిపడేవారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్ ప్రక్రియకు ఎక్కువ డబ్బు ఖర్చవుతుండడంతో బాధితులకు ఆర్థికంగా భారమయ్యేది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలు బాధితులకు భరోసానిస్తున్నాయి.
-డాక్టర్ సరళ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, కొత్తగూడెం