
‘దళితబంధు’తో ఎస్సీ కుటుంబాల అభ్యున్నతి
అభిప్రాయ సేకరణలో ఖమ్మం జడ్పీ చైర్మన్ కమల్‌రాజ్
చింతకాని, సెప్టెంబర్ 12: స్థానిక దళితుల సమస్యలన్నీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. దళితబంధు పథకంతో దళితుల సమస్యలన్నీ దూరమవుతాయని అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కోపూరి పూర్ణయ్య అధ్యక్షతన ఆదివారం జరిగిన దళితబంధు సన్నాహక, అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత బడ్జెట్లో దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.1000 కోట్లు కేటాయించారని అన్నారు. ఏడున్నర దశాబ్దాలుగా దళితుల జీవితాల్లో మార్పులేకపోవడాన్ని గమనించిన సీఎం కేసీఆర్.. దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా చింతకాని మండలాన్ని ఎంపిక చేశారని గుర్తుచేశారు. దళితబంధు విధివిధానాలు రూపొందించడం కోసం సీఎం సారథ్యంలో జరగబోయే సమావేశానికి సోమవారం తాము హాజరుకానున్నట్లు చెప్పారు. అంతకు ముందు 26 గ్రామాల దళిత ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను గ్రామాల వారీగా జడ్పీ చైర్మన్, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దళిత కాలనీల్లో సీసీ రోడ్లు, గృహ నిర్మాణాలు, సాగు, తాగు నీటి బోర్లు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ భవనాలు, శ్మశాన వాటికలు, దళితులకు కేటాయించిన భూముల్లో రెవెన్యూ పరంగా జరిగిన పొరపాట్ల సవరణ వంటి సమస్యలను జడ్పీ చైర్మన్‌కు విన్నవించారు. సమస్యలను నివేదిక రూపంలో తయారుచేసుకొని సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నట్లు కమల్‌రాజు పేర్కొన్నారు. ఆర్డీవో రవీంద్రనాథ్, జడ్పీ సీఈవో అప్పారావు, డీపీవో ప్రభాకర్, డీఆర్డీవో విద్యాచందన, ఎంపీడీవో రవికుమార్, తహసీల్దార్ తిరుమలాచారి, ఎంపీపీ పూర్ణయ్య, ఎంపీవో రవీంద్రప్రసాద్, దళిత ప్రజాప్రతినిధులు, రైతుబంధుసమితి సభ్యులు పెంట్యాల పుల్లయ్య, కిలారు మనోహర్, మంకెన రమేశ్ పాల్గొన్నారు.