
మెరుగైన వసతుల కల్పనకు తెలంగాణ సర్కార్ కార్యాచరణ
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధుల వినియోగానికి గ్రీన్‌సిగ్నల్
40 శాతం నిధులు వినియోగించుకునే అవకాశం
ప్రతిపాదనలు సిద్ధం చేయిస్తున్న ఎమ్మెల్యేలు
ఖమ్మం, ఆగస్టు 12 (నమస్తేతెలంగాణ ప్రతినిధి):తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నది. కార్పొ‘రేట్’ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నది. విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో విద్యబోధన జరిగేలా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఏటా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గ నిధులను వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రతి శాసన సభ్యుడికి రూ.5 కోట్లు కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు కేటాయించిన నియోజకవర్గ అభివృద్ధ్ధి నిధుల్లో 40 శాతం గ్రామీణ, పట్టణ ప్రాంతల్లోని పాఠశాలలు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నది. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. అందుకుగాను ఏటా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గ నిధులను వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రతి శాసనసభ్యుడికి రూ.5 కోట్లు కేటాయించాలని ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు కేటాయించిన నియోజక వర్గ అభివృద్ధ్ధి నిధుల్లో 40 శాతం నిధులను గ్రామీణ, పట్టణ ప్రాంతల్లోని పాఠశాలకు వినియోగించుకునేలా మార్గదర్శకాలు నిర్దేశించింది. ఈ ప్రకారం పాఠశాలలకు రూ.2 కోట్ల వరకు వెచ్చించే అవకాశం ఏర్పడింది.
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న యంత్రాంగం
ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా, ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం ఈ నిధులను ఖర్చు చేసే అవకాశం ఏర్పడింది. విద్యార్థుల విద్యా అవసరాలు తీర్చేందుకు శాసనసభ్యులు సిద్ధమవుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే పనిలో పడ్డారు. ఉమ్మడి జిల్లాలో గురుకులాలు, కస్తూర్బా, గిరిజన ఆశ్రమ, ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు 3,400 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో రూ.2.50 లక్షల మంది చదువుకుంటున్నారు. పాఠశాలల్లో వసతులపై ఇప్పటికే ఎమ్మెల్యేలు అధికారుల నుంచి నివేదికలు కోరారు. వారు ప్రతిపాదించే పనులను జిల్లా మంత్రి ఆమోదిస్తారు. తర్వాత ఆ అంచనాలను జిల్లా ప్రణాళిక అధికారులు ఆయా శాఖల ఇంజినీరింగ్ అధికారులకు పంపిస్తారు. వారు కలెక్టర్లకు పరిపాలన అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపిస్తారు. పనులు ప్రారంభమైతే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనున్నది.
1226 స్కూల్స్.. 5,606 మంది టీచర్లు
జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో 1226 స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలున్నాయి. జిల్లాలో 5,606 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో పురుషులు-1,153 మంది, మహిళలు-873మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పురుషులు-661మంది, మహిళలు-391మంది, ఉన్నత పాఠశాలల్లో పురుషులు-1,512మంది, మహిళలు-1,016మంది ఉన్నారు. మొత్తం విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న టీచర్లలో పురుషులు-3,326 మంది, మహిళలు-2,280 మంది, మొత్తంగా 5606 మంది ఉన్నారు.