
వారి చెంతనే కుమారుడి ప్రతిమ కూడా..
కల్లూరులో ఆలయం కట్టించిన ఎంపీపీ బీరవల్లి రఘు
విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి అజయ్, ఎమ్మెల్యే సండ్ర
కల్లూరు, ఆగస్టు 12: తనను కన్న తల్లిదండ్రులు కాలం చేశాక వారికి గుడి కట్టించాడు ఓ ఎంపీపీ. ఆ ఆలయంలో తన తల్లిదండ్రులు విగ్రహాలతోపాటు తన కుమారుడి విగ్రహాన్నీ ప్రతిష్ఠించాడు. వారి జ్ఞాపకార్థంగా అక్కడ ఓ మినరల్ వాటర్ ప్లాంటును కూడా ఏర్పాటు చేసి గ్రామస్తులందరికీ ఉచితంగా శుద్ధజలం అందిస్తున్నాడు. ఆయనే కల్లూరు ఎంపీపీ బీరవల్లి రఘు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన బీరవల్లి రఘు ఆ మండల ఎంపీపీ. ఆయన తల్లి పుల్లమ్మ ఎనిమిదేళ్ల క్రితం కాలం చేయగా.. తండ్రి నర్సింహ ఇటీవల పరమపదించారు. తన కుమారుడు సుమారు పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. తన తల్లిదండ్రులపై మమకారంతో సోదరుడు శ్రీనివాసరావుతో కలిసి వారికి గుడి కట్టించాడు బీరవల్లి రఘు. అందులో తన తల్లిదండ్రుల విగ్రహాలతోపాటు తన కుమారుడు అభినవ్ విగ్రహాన్నీ ప్రతిష్ఠించాడు. రఘు తండ్రి నర్సింహ ఇటీవల మరణించగా గురువారం తమ గ్రామంలో అతడి దశదిన కర్మలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గుడిని, అందులోని తన తల్లిదండ్రుల విగ్రహాలను మంత్రి అజయ్‌కుమార్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో ఆవిష్కరింపజేశాడు ఎంపీపీ బీరవల్లి రఘు.